మహమ్మారి కరోనా వ్యాప్తి నియంత్రణకు దేశంలో రెండోదశ లాక్డౌన్ ప్రకటించారు ప్రధాని మోదీ. అనంతరం కొన్నింటికి మినహాయింపులు ఇస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్ర హోంశాఖ. అయితే తాజాగా వాటిని సవరించి మరిన్నింటికి మినహాయింపు ఇచ్చినట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా వెల్లడించారు. ఈమేరకు అన్ని శాఖలు, విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో..
గ్రామీణ ప్రాంతాల్లో జరిగే నిర్మాణ పనులు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం పనులు, విద్యుత్ లైన్లు, టెలిఫోన్ లైన్లు, ఆప్టిక్ ఫైబర్ లైన్ల ఏర్పాటుకు సంబంధించిన అన్ని కార్యకలాపాలకు అనుమతులు మంజూరు చేసింది కేంద్రం.
బ్యాంకింగేతర సంస్థలకు..
దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలకు, సహకార రుణ సంస్థలకు, తక్కువ సిబ్బందితో కార్యకలాపాలు సాగించే విత్త సంస్థలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది.