కరోనా వ్యాక్సిన్ను ప్రజలకు ఉచితంగా అందిస్తామని బిహార్ ఎన్నికల మేనిఫెస్టోలో భాజపా హామీ ఇవ్వడాన్ని వివిధ రాజకీయ పార్టీలు తప్పుబడుతున్నాయి. అయితే ఈ విషయంపై ఎన్నికల సంఘం మాజీ అధికారులు స్పందించారు. భాజపా హామీ చట్టబద్ధంగా తప్పుకాదన్నారు.
అయితే భాజపా ఎన్నికల హామీ నైతికత ప్రశ్నను లెవనెత్తుతోందన్నారు ఎస్వై ఖురేషీ. ఎన్నికల ప్రవర్తన నియమావళి పూర్తిగా నైతిక విలువలకు సంబంధించిందని చెప్పారు. 2010 నుంచి 2012 మధ్య కాలంలో పోల్ ప్యానెల్ చీఫ్గా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.
రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఎలాంటి హామీలైనా ఇవ్వొచ్చని మరో మాజీ అధికారి ఓపీ రావత్ అన్నారు. అయితే ఆ హామీని నెరవేర్చడానికి ఎంత బడ్జెట్ అవుతుందనే విషయాన్ని కూడా ఆయా పార్టీలు మేనిఫెస్టోలో పొందుపర్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 2018, డిసెంబర్లో ఎన్నికల సంఘం ప్రధాన అధికారి బాధ్యతలకు వీడ్కోలు పలికారు రావత్.