తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరి వాళ్లేమైనా బంగ్లాదేశీయులా?: ఉద్ధవ్‌ - uddhav thackeray fired on kangana ranaut

బిహార్​ ఎన్నికల్లో భాజపాను గెలిపిస్తే కరోనా వ్యాక్సిన్​ ఉచితంగా అందిస్తామని ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే తీవ్రంగా ఆక్షేపించారు. మిగిలిన రాష్ట్రాల్లో ఉండే ప్రజలేమైనా ఇతర దేశాల నుంచి వచ్చారని భావిస్తున్నారా అని ప్రశ్నించారు.

Free-vaccine-in-Bihar-are-others-from-Bdesh-Uddhav-to-BJP
మరి వాళ్లేమైనా బంగ్లాదేశీయులా?: ఉద్ధవ్‌

By

Published : Oct 25, 2020, 11:01 PM IST

ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా తాము గెలిస్తే బిహార్‌ ప్రజలకు ఉచితంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేస్తామని భాజపా హామీ ఇవ్వడాన్ని శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే తప్పుబట్టారు. మిగిలిన రాష్ట్రాల వారు బంగ్లాదేశ్‌ నుంచో, కజకిస్థాన్‌ నుంచో వచ్చారని ఆ పార్టీ భావిస్తోందా? అని ప్రశ్నించారు. శివసేన నిర్వహించే వార్షిక దసరా వేడుకల్లో భాగంగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంపై విరుచుకుపడ్డారు. కంగన వ్యాఖ్యలు, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య అంశాలను కూడా పరోక్షంగా ప్రస్తావించారు.

బిహార్‌కు మాత్రమే ఉచిత వ్యాక్సిన్‌ ఇస్తామని చెప్పేవాళ్లు సిగ్గు పడాలని ఉద్ధవ్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు. అలా మాట్లాడేవారు తాము కేంద్రంలో అధికారంలో ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. "కొందరు జీవనోపాధి కోసం ముంబయి వచ్చి నగరాన్ని పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పోలుస్తారు" అంటూ కంగననుద్దేశించి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. "బిహార్‌ బిడ్డ కోసం మొసలి కన్నీళ్లు కార్చేవ్యక్తులు.. అదే సమయంలో మహారాష్ట్ర బిడ్డపై వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారు" అంటూ రాజ్‌పూత్‌ వ్యవహారంలోకి ఆదిత్య ఠాక్రేను తీసుకురావడాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.

జీఎస్టీ విషయంలో కేంద్రం పునరాలోచన చేయాలని, అవసరమైతే కొన్ని మార్పులు చేయాలని కేంద్రానికి ఉద్ధవ్‌ సూచించారు. రాష్ట్రానికి పరిహారం కింద రూ.38వేల కోట్లు రావాల్సి ఉందని చెప్పారు. ప్రజలను కులం, మతం, ప్రాంతం ఆధారంగా విభజించొద్దని భాజపాకు హితవు పలికారు.

ఇదీ చూడండి: పాలకుడికి అహంకారం తగదు: సోనియా

ABOUT THE AUTHOR

...view details