ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం దిల్లీలో ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. ఇది మహిళల భద్రతకు ఎంతో ఉపకరిస్తుందని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా పేర్కొన్నారు.
ఈ ఉచిత ప్రయాణ పథకాన్ని పొందడానికి దిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ).. క్లస్టర్ బస్సుల్లో పయనించే మహిళలకు పింక్ టికెట్లు ఇవ్వనుంది. ఈ టికెట్ల ధరను డీటీసీకి ప్రభుత్వం చెల్లిస్తుంది.
"దిల్లీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ఇవాళ ప్రారంభమైంది. దిల్లీకి శుభాకాంక్షలు. ఇది మహిళల భద్రతకు తోడ్పడుతుంది. దిల్లీ ఆర్థిక వ్యవస్థలో మహిళ పాత్రను మరింత ఇనుమడింపజేస్తుంది."
- మనీశ్ సిసోడియా ట్వీట్, దిల్లీ ఉపముఖ్యమంత్రి
సోమవారం రాత్రి కేజ్రీవాల్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోయిడా-ఎన్సీఆర్, విమానాశ్రయం, డీటీసీ, క్లస్టర్ స్కీమ్ ఆపరేటర్లు నిర్వహించే ఇతర ప్రత్యేక సేవల్లోనూ ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుంది. ఈ పథకం పట్ల అక్కడి మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.