తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒక్క సిటీ.. ఒక్క వారం.. నాలుగు వేల పెళ్లిళ్లు! - covid time wedding in rajasthan

ఓ వైపు కరోనా వైరస్‌ బుసలు కొడుతున్నా.. వివాహ వేడుకల విషయంలో ప్రజలు వెనక్కి తగ్గడం లేదు. మంచి ముహూర్తాలు ఉండటంతో ఒక్క జైపుర్‌ నగరంలోనే రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు జరుగుతున్నట్టు అధికారులు వెల్లడించారు.

four thousand marriages in jaipur in one week while corona cases increasing
ఏడు రోజులు... నాలుగు వేల పెళ్లిళ్లు!

By

Published : Nov 26, 2020, 8:32 PM IST

రాజస్థాన్‌లో రోజూ 3వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నప్పటికీ బుధవారం నుంచి ఈ నెల 30 వరకు 4వేల వివాహాలు జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 25, 27, 30 తేదీల్లో రికార్డు స్థాయిలో 4వేల వివాహాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ వేడుకల సందర్భంగా కొవిడ్‌ మరింతగా విజృంభించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బాధగానే ఉంది.. కానీ ఇదే బెటర్‌: వధువు

కరోనా నేపథ్యంలో జరుగుతున్న తన పెళ్లిపై పెళ్లికూతురు నిహారికా సింగ్‌ స్పందిస్తూ.. నా స్నేహితులు, ముఖ్యంగా విదేశాల నుంచి రావాల్సిన వారికి కుదరడంలేదు. ఇందుకు చాలా బాధగా ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ మందితోనే సురక్షితమని భావిస్తున్నా’ అని చెప్పారు. తమ సోషల్‌సర్కిల్‌ చాలా పెద్దదని, కానీ పెళ్లికి 100 మందికే అవకాశం ఉందన్నారు. కొందరు కొవిడ్ ‌భయంతో పెళ్లికి వచ్చేందుకు కూడా వెనకడుగు వేస్తున్నారని చెప్పారు. మాస్క్‌ పెట్టుకొని పూజలు చేయలేమని కమల్‌ చంద్‌శాస్త్రి అనే పూజారి అన్నారు. చాలా పెళ్లిళ్లలో జనం రద్దీని నివారించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. పెళ్లి మండపం పైకి వధూవరులను, వారి తల్లిదండ్రులను తప్ప ఎవరినీ అనుమతించడంలేదన్నారు.

ప్రభుత్వం కఠిన నిబంధనలు..

వివాహ వేడుకలు సూపర్‌ స్పెడర్లుగా ఉండటంతో పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం కఠినమైన మార్గదర్శకాలు అమలుచేస్తోంది. పెళ్లిళ్లకు వచ్చే అతిథుల సంఖ్య 100కు మించరాదని, ప్రతిఒక్కరూ మాస్క్‌లు, శానిటైజర్లు, భౌతికదూరం పాటించాలని సూచిస్తోంది. ఎవరైనా ఉల్లంఘనకు పాల్పడితే రూ.25వేల వరకు జరిమానా విధించనున్నట్టు హెచ్చరిస్తోంది. వివాహ వేడుకలను వీడియో తీసి ఉంచాలని సూచిస్తున్నట్టు ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ కేకే శర్మ అన్నారు.

నిపుణులేమంటున్నారు?

మరోవైపు, వివాహ వేడుకలు జరిగిన తర్వాత జరిమానాలు విధించడం వల్ల కరోనా గ్రాఫ్‌ తగ్గుముఖం పట్టదని నిపుణులు చెబుతున్నారు. దీపావళి పండుగ తర్వాత కేసులు పెరిగాయని, అలాగే ఇప్పుడు పెళ్లిళ్లలో జనం గుమిగూడటం, పెళ్లిళ్ల షాపింగ్‌ తదితర కార్యక్రమాల వల్ల మరోసారి ఈ వైరస్‌ వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రాజస్థాన్‌లో గత నాలుగు రోజుల నుంచి కరోనా కేసులు 1.34శాతం పెరిగాయి. బుధవారం ఒక్కరోజే 3285 కొత్త కేసులు, 18 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా జైపుర్‌లో 600 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,53,767కి చేరగా.. మరణాలు 2218కి పెరిగాయి. ప్రస్తుతం 26,320 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఇదీ చూడండి: మంచు కురిసె.. పర్యటకులు మురిసె...

ABOUT THE AUTHOR

...view details