మలేరియా ఔషధం హైడ్రాక్సీక్లోరోక్విన్ ప్రమాదకరమని చాలా అధ్యయనాలు చెబుతున్న తరుణంలో భారత వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్) కీలక విషయం వెల్లడించింది. 4 లేదా అంతకన్నా ఎక్కువ డోసులు తీసుకోవటం వల్ల ఆరోగ్య కార్యకర్తలకు కరోనా సోకే ముప్పు తగ్గినట్లు గుర్తించామని తెలిపింది.
కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్య, ఆరోగ్య సిబ్బందికి వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం అధికంగా ఉంటుంది. వీరిపై ఐసీఎంఆర్ చేసిన అధ్యయనంలో వైరస్ సంక్రమణ అవకాశం గణనీయంగా 80 శాతం తగ్గిందని వెల్లడైంది. వీరంతా 6, ఆపైన హైడ్రాక్సీ క్లోరోక్విన్ ప్రొఫిలాక్సిస్ డోసులు వేసుకున్నట్లు తెలిపారు పరిశోధకులు.
అందుకోసమే ఈ పరిశోధన..
దేశంలోని ఆరోగ్య కార్యకర్తల్లో వైరస్ సంక్రమణ, రక్షణ విధానాలను పోల్చి ఐసీఎంఆర్ పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ పరిశోధన ఫలితాలు ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురించారు.
ఈ అధ్యయనంలో మొత్తం 1173 మందిని పరీక్షించారు. వీరిలో 624 మంది వైరస్ సోకినవారు కాగా, 549 మంది ముందస్తుగా ఔషధాన్ని తీసుకున్నవారు. దేశవ్యాప్తంగా ర్యాండమ్‌గా ఎంపిక చేసిన సిబ్బందిని పాజిటివ్, నెగటివ్ విభాగాలుగా విభజించారు. పీపీఈ, కార్యాస్థలం, జాగ్రత్తలు విషయానికి సంబంధించి 20 అంశాలతో సంక్షిప్త ప్రశ్నావళిని రూపొందించి వాటికి సమాధానాలు సేకరించారు.
ఈసారి హెచ్‌సీక్యూ సామర్థ్యంపై కాకుండా హెల్త్‌కేర్ వర్కర్లకు వైరస్ సోకే ముప్పునకు గల కారణాల కోసమే అధ్యయనం చేసినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనంలో హెచ్‌సీక్యూ ఎంత మోతాదులో తీసుకుంటే వైరస్ సంక్రమించే అవకాశం తగ్గుతుందో కూడా గమనించామని వెల్లడించారు.