టిక్‌టాక్.. ఈ కాలంలో విపరీతంగా ప్రాచుర్యం పొందిన వీడియో యాప్. దీని ద్వారా కొందరి జీవితాలు ఇబ్బందులు పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వీడియోలు చేసే క్రమంలో కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ఇదే క్రమంలో దిల్లీ రోహిణి నగరంలో టికిటాక్ వీడియో వల్ల రెండు బృందాల మధ్య మొదలైన గొడవ.. కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో తుపాకీ కాల్పుల వల్ల నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
అగర్ నగర్‌లోని సోమ్ విహార్ ప్రాంతంలో సోమవారం రాత్రి 10:02 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిలో రవిశర్మ (25), రాజేందర్ (46), హిమాన్షు పాల్ (23), సంజీవ్ కుమార్ (21)లు ఉన్నారు. వీరంతా అగర్ నగర్, బ్రిజి విహార్, షీష్ మహల్ గృహ సముదాయాలకు చెందిన వారు.
టిక్‌టాక్ చేయొద్దని...
ఇరు వర్గాలకు చెందిన సభ్యులు.. నవంబర్ 29న ఓ వివాహ శుభకార్యానికి హాజరయ్యారు. అక్కడ టిక్‌టాక్ వీడియో చేసే క్రమంలో వాగ్వాదం జరిగింది. వీడియో చిత్రీకరించొద్దని ఓ బృందానికి చెందిన వ్యక్తి మరో బృందాన్ని హెచ్చరించాడు. వారి మధ్య వాగ్వాదం జరిగింది. మరుసటి రోజు ఆ వ్యక్తి.. బాధితుల్లో ఒకరిపై దాడి చేశాడు.