తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ-జిన్​పింగ్​ భేటీ నూతన వసంతాన్ని తెచ్చేనా! - beti

మరికొద్ది వారాల్లో భారత్-చైనా అగ్రనేతలు నరేంద్రమోదీ, షి జిన్​పింగ్ భేటీ కానున్నారు. జమ్ముకశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు నేపథ్యంలో పాకిస్థాన్ అనుకూలంగా మాట్లాడిన డ్రాగన్ దేశం.. ఈ సదస్సులో ఏ వైఖరి అవలంబించనుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మోదీ-జిన్​పింగ్ భేటీపై అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు స్మితా శర్మ అభిప్రాయాలు..

మోదీ-జిన్​పింగ్​ భేటీ నూతన వసంతాన్ని తెచ్చేనా!

By

Published : Sep 20, 2019, 9:38 PM IST

Updated : Oct 1, 2019, 9:23 AM IST

'సుదూర ప్రయాణం చేయాలంటే ఒక సమయంలో ఒకే అడుగు వేయాలి' అని చైనా సామెత. ఇప్పటివరకూ ఇలా ఎన్నో అడుగులు వేసినప్పటికీ భారత్​, చైనాల మధ్య నెలకొన్న అపనమ్మకాలు.. అతికష్టం మీద తీరే అవకాశాలు ప్రస్తుతం కన్పిస్తున్నాయి.

గతేడాది జరిగిన వుహాన్​ సదస్సు ఇచ్చిన ఉత్సాహంతో చైనా అధ్యక్షుడు షి జిన్​పింగ్​ను అనధికారిక పర్యటన కోసం అక్టోబర్​లో భారత్​కు రావాలని ఆహ్వానించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. షాంఘై సహకార సంస్థ(ఎస్​సీఓ), జపాన్​​లో జరిగిన జీ-20 దేశాల సదస్సు వేదికగా ఇప్పటికే ఇరునేతలు ఈ ఏడాదిలో రెండు సార్లు భేటీ అయ్యారు.

ఇదిలా ఉంటే.. ఇరునేతల భేటీకి సన్నాహాలు జరుగుతున్న వేళ చైనా టెక్​ దిగ్గజం హువావే 5జీ నెట్​వర్క్​కు భద్రతా అనుమతులు ఇవ్వకూడదని భారత్​పై ఒత్తిడి తెస్తోంది అగ్రరాజ్యం అమెరికా.

సమగ్ర ప్రాంతీయ ఆర్థిక సహకారం(ఆర్​సీఈపీ)పై చైనాతో ఆసియాన్ దేశాల విముఖత, వుహాన్​లో అవగాహనకు వచ్చిన బీసీఐఎమ్​(బంగ్లాదేశ్, చైనా, భారత్, మయన్మార్) ఆర్థిక నడవా, జపాన్​ పెట్టుబడుల ప్రోత్సాహం కోసం.. ఈశాన్య దేశాల సహకారం నుంచి చైనాను దూరంగా ఉంచడం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి.

కీలకంగా కశ్మీర్ అంశం..

ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఇరు దేశాల మధ్య విభేదాలు తీవ్రమయిన నేపథ్యంలో మోదీ-జిన్​పింగ్​ల భేటీలో కశ్మీర్ అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఆసియా దేశాల్లో ప్రధానమైనవి భారత్​-చైనాలేనని.. డ్రాగన్​తో కలిసి ఉండాలని ఓ అవగాహన తమకు ఉందని ఇటీవల వ్లాదివోస్తోక్ సదస్సుకు ముందు విదేశాంగ మంత్రి జయ్​శంకర్ వ్యాఖ్యానించారు. సరిహద్దు సహా పలు అంశాల్లో చైనాతో విభేదాలు ఉన్నప్పటికీ ఇవన్నీ కూర్చుని చర్చించాల్సిన అంశాలేనని ఆయన పేర్కొన్నారు.

జిన్​పింగ్ పర్యటన వార్తల నాటి నుంచి ప్రధాని సొంత నియోజకవర్గం వారణాసి, తమిళనాడులోని ఏదైనా తీర పట్టణం వేదికగా భేటీ ఉండవచ్చని ఊహాగానాలు వినిపించాయి. అయితే భారత్ కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చేసిన కారణంగా సమావేశంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

కశ్మీర్​ అంశంపై బాహాటంగానే తన వ్యతిరేక ధోరణిని బయటపెట్టింది డ్రాగన్. ఈ దశలో విదేశాంగ మంత్రి జయ్​శంకర్ చైనా పర్యటన సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్గతంగా తీసుకున్న నిర్ణయాలు సరిహద్దు వెంట ఎలాంటి ప్రభావం చూపవని పేర్కొన్నారు. లద్దాఖ్​పై చట్టసభలో తీసుకున్న నిర్ణయం వల్ల భారత్​-చైనా నియంత్రణ రేఖ వెంట మార్పుల కోసం ఉద్దేశించింది కాదని వ్యాఖ్యానించారు. భారత్ తీసుకున్న నిర్ణయం ఆమోదయోగ్యం కాదని.. నూతన చట్టం ద్వారా చైనా ప్రాదేశిక సార్వభౌమాధికారాన్ని ఇండియా తక్కువ చేసినట్లయిందని వ్యాఖ్యానించారు.

జయ్​శంకర్​ పర్యటన అనంతరం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కశ్మీర్ అంశం చర్చించాలని డ్రాగన్ తన మిత్రదేశం పాకిస్థాన్​కు అనుకూల వ్యాఖ్యలు చేసింది. భారత్-చైనా మధ్య జరగాల్సి ఉన్న ప్రత్యేక ప్రతినిధుల సమావేశానికి రాకుండా డ్రాగన్ విదేశాంగ మంత్రి వాంగ్​యీ పాక్​లో పర్యటించి భారత్​కు పరోక్ష సందేశమిచ్చారు. 22వ ప్రతినిధుల సదస్సులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​తో భేటీ కావాల్సి ఉండగా పాక్ రాజకీయ, సైన్యం ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.

వాంగ్​యీ రాని కారణంగా తాజా సమావేశ తేదీలను మరోసారి ఖరారు చేసింది భారత్.

'ఎల్​ఓసీ వద్ద ఉద్రిక్తత.. ఎల్​ఏసీకి శాంతి'

వాస్తవాధీన రేఖ వద్ద శాంతి లక్ష్యంగా అంతర్జాతీయ వేదికలపై పాక్ తీరును ఎండగడుతోంది భారత్. నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంట దాయాది కాల్పులు జరపడాన్ని ఎత్తి చూపుతోంది. ఆర్టికల్ రద్దుపై పార్లమెంటులో చర్చ సందర్భంగా అక్సాయిచిన్, పీఓకేలు భారత్​తో విడదీయలేని భూభాగాలని పేర్కొన్నారు హోంమంత్రి అమిత్​షా. గతవారం భారత్​-చైనా సైనికుల మధ్య ప్యాంగ్​గాంగ్ త్సో నది తీరం వెంట తలెత్తిన స్వల్ప ఘర్షణ ఇరుదేశాల మిలిటరీ సంప్రదింపుల ద్వారా సమసిపోయింది. కానీ జిన్​పింగ్ పర్యటన సందర్భంగా చొరబాట్ల నియంత్రణ గతం సంబంధించి అనుభవాలను చెరిపివేయలేవు.

2017లో ప్యాంగ్​గాంగ్​ తీరం వెంటే చైనా చొరబాటును నియంత్రించింది భారత్. ఈ ఘటన సందర్భంగా ఇరు సైన్య విభాగాలు రాళ్లు రువ్వుకున్నాయి. డోక్లాం వద్ద 73 రోజులపాటు ఇరు దేశాలు మోహరించిన వీడియో ఒకటి ఆ సమయంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. కానీ అప్పుడు వుహాన్ సదస్సు వేదికగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గేందుకు, ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు కోసం ఇరుదేశాలు అంగీకరించాయి.

2014లో చైనా అధ్యక్షుడి హోదాలో భారత్​కు వచ్చారు జిన్​పింగ్. ఆసమయంలో చుమార్​ వరకు రహదారి నిర్మణానికి చైనా సేనలు ప్రయత్నించాయి. అదే సమయంలో చైనాకు చెందిన సాంగ్ క్లాస్ సబ్​మెరైన్ కొలొంబో లక్ష్యంగా బాంబర్లను వదిలిన వార్తలు పతాక శీర్షికల్లో నిలిచాయి. 2013లోనూ.. చైనా ప్రధాని లీ కెకియాంగ్ భారత సందర్శన సమయంలో లద్దాఖ్​ను దురాక్రమించేందుకు డ్రాగన్ ప్రయత్నించింది. కానీ చైనా ప్రయత్నాలను భారత సేనలు సమర్థంగా నిలువరించాయి. బీజింగ్ చొరబాటు ప్రయత్నాలు చేస్తూ 4వేల కిలోమీటర్ల పొడవైన సరిహద్దు వెంట భారత్​పై ఒత్తిడి పెట్టింది.

వ్యూహాత్మకంగా రష్యా..

చైనాను నిలువరించే దిశగా ఇండో-పసిఫిక్ వ్యూహంలో భాగంగా అమెరికా, జపాన్​లతో భారత్​ సంబంధాలను మెరుగుపరుచుకుంది. ఆసియాలో తన పట్టును బిగించేందుకు ప్రయత్నిస్తోంది రష్యా. ఈ నేపథ్యంలోనే ఇటీవల వ్లాదివోస్తోక్ వేదికగా మోదీతో సమావేశమయ్యారు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.

చైనాతో తలపెట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటీవ్(బీఆర్​ఐ)ను విరమించుకోవాలన్న ఐరోపా ఒత్తిళ్లతో.. ఆయా దేశాలతో సంబంధాల మెరుగుదల కోసం ప్రయత్నిస్తున్న పుతిన్ ఈ కార్యక్రమంపై పునారాలోచనలో పడ్డారు. ఇండో-పసిఫిక్ సంబంధాలపై కూడా ఆసియాన్​ వంటి వేదికలతో తన సంబంధాలపై సమీక్షించడం ద్వారా రష్యా తన వ్యూహాన్ని నేర్పుగా అమలు చేస్తోందని దిల్లీలోని సెంటర్​ ఫర్ పవర్ స్టడీస్ పరిశోధకుడు కార్ల్ జాన్​సన్ వ్యాఖ్యలను ఇక్కడ మరచిపోకూడని అంశం.

'అణచివేత అనేది మీ చరిత్రలో భాగం.. మాది కాదు. ప్రచ్ఛన్న యుద్ధం నాటి ఆలోచనాధోరణిని రష్యా విడనాడాలి. నాటి కాలం పోయింది. మీరు ఉన్నది భిన్న ధృవాల ప్రపంచ'మని వ్లాదివోస్తోక్​ సమావేశానికి ముందు వాల్దాయి క్లబ్​ వేదికగా భారత విదేశాంగ మంత్రి జయ్​శంకర్ వ్యాఖ్యానించారు.

అందుకే ఈ వ్యూహం

ఇండో-పసిఫిక్ సంబంధాల వ్యూహం చైనా ఆక్రమణ ధోరణికి వ్యతిరేకంగానే అని తెలిపారు జయ్​శంకర్​. ఆక్రమణ ధోరణిని విడనాడాలన్న భారత హితవును బేఖాతరు చేస్తూ డ్రాగన్ అధ్యక్షుడు జిన్​పింగ్ ఆశయమైన చైనీస్ డ్రీమ్ అనే లక్ష్యం దిశగా పయనిస్తోంది ఆ దేశం. ఈ నేపథ్యంలోనే దక్షిణాసియాలో భారత్​ను నిలువరించేందుకు పాకిస్థాన్​ను పావుగా వాడుకుంటోంది చైనా.

మరికొద్ది రోజుల్లో ఐరాస సాధారణ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్న నేపథ్యంలో కశ్మీర్ అంశాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్ లేవనెత్తితే భారత్-పాకిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది. చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవాలో బిలియన్ డాలర్ల పెట్టుబడితో పాక్ జనరళ్లను బ్యాటింగ్ చేయనుంది.

'అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ ప్రభుత్వంలో, హు జింటావో తొలి పాలనాకాలంలో అనుసరించిన వైఖరినే చైనా ఇంకా అవలంబిస్తోంది. తాజాగా కశ్మీర్ భూభాగంలో వంతెన నుంచి పాకిస్థాన్​లో గ్వాదర్ నౌకాశ్రయం నిర్మాణాల వరకు భారత్​ నుంచి వ్యతిరేకత తలెత్తితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంద'ని 2015 నాటి 'ద చైనా పాకిస్థాన్ యాక్సిస్' అనే పుస్తకంలో ఆండ్రూ స్మాల్ వ్యాఖ్యలు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం. భారత్​తో ద్వైపాక్షిక వ్యవహారాల్లో సమస్యలు తలెత్తితే పాకిస్థాన్​ను సమతౌల్యం చేసే పావుగా పాక్​ను వాడుకుంటూనే ఉంది డ్రాగన్​ అని ఆయన తన పుస్తకంలో పేర్కొన్నారు.

సవాళ్లను దాటడం కష్టమే

కశ్మీర్​ నీడలు, పాకిస్థాన్​పై ప్రేమ, సరిహద్దు ఉగ్రవాదం మినహాయించి భారత్​-చైనా బంధాన్ని బలోపేతం చేయటం సవాలుగా నిలుస్తోంది.
అందువల్ల మరికొన్ని వారాల్లో జరగనున్న ఇరు నేతల భేటీ పెద్ద ఫలితాలు ఇస్తుందని అంచనా వేయలేం. క్షీణించిన సంబంధాల పునరుద్ధరణే ప్రస్తుత ప్రాధాన్యాంశం. వాణిజ్య లోటు తగ్గించడం సహా వుహాన్ సదస్సులో పేర్కొన్న అంశాలు ఈ భేటీ మరికొన్ని అజెండాలుగా ఉండనున్నాయి.

"మంచి ఏడాదిని ఆకాంక్షించేవారు వసంతకాలం నుంచే ఆలోచిస్తారు" అనే చైనీస్ సామెత ఇక్కడ ప్రస్తావానార్హమైన సామెత. చైనా-భారత్ సంబంధాల్లో ఈ శిశిరకాల భేటీ పునరుత్తేజితమైన వసంతాన్ని తీసుకువచ్చే నిర్ణాయక కాలం.

ఇదీ చూడండి: 'అయోధ్య కేసు తేల్చేందుకు అదనపు పని గంట'

Last Updated : Oct 1, 2019, 9:23 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details