మన్రేగా రూపశిల్పి రఘువంశ్..
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం- మన్రేగాకు రూపశిల్పి, కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్(74) ఇకలేరు. కరోనా సోకి వారం రోజులుగా దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం కన్నుమూశారు. ఆర్జేడీతో ఉన్న సుదీర్ఘ బంధాన్ని తెంచుకొని 3 రోజుల క్రితమే ఆ పార్టీకి రాజీనామా చేసిన రఘువంశ్ శుక్రవారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. పరిస్ధితి విషమించగా.. వెంటిలేటర్ అమర్చి చికిత్స కొనసాగిస్తున్న తరుణంలోనే తుది శ్వాస విడిచారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడుగా కొనసాగిన రఘువంశ్.. ఈ నెల 10న ఆసుపత్రి నుంచే రాజీనామా లేఖను ఆయనకు పంపించారు. యూపీఏ హయాంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన రఘువంశ్ ఎంతో మంది పేదలకు ఉపాధి చూపిస్తున్న మన్రేగాను రూపొందించారు.
రఘువంశ్‌కు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉంది. ఆయన భార్య గతంలోనే చనిపోయారు. అంత్యక్రియల నిమిత్తం రఘువంశ్ భౌతిక కాయాన్ని దిల్లీ నుంచి పట్నా తరలించనున్నారు.
ప్రముఖుల సంతాపం..
రఘువంశ్ మరణం విషాదాన్ని నింపిందని అన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. గ్రామీణ భారతం అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.