తెలంగాణ

telangana

కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూత

By

Published : Sep 27, 2020, 8:44 AM IST

Updated : Sep 27, 2020, 10:47 AM IST

Former Union Minister Jaswant Singh passed away today.
కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూత

10:38 September 27

కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్‌ సింగ్‌ ఇక లేరు. అటల్ బిహారీ వాజ్‌పేయీ మంత్రివర్గంలో ఆర్థిక, విదేశాంగ, రక్షణ వంటి కీలక శాఖలకు జశ్వంత్ మంత్రిగా పని చేశారు. భాజపా వ్యవస్ధాపక సభ్యుల్లో ఆయన ఒకరు. 1999లో కాందహార్‌ విమాన హైజాక్‌ సమయంలో తాలిబన్లతో ఆయన చర్చలు జరిపారు. 

కోమాలో...

82 ఏళ్ల జశ్వంత్‌ 2014లో ఇంట్లో జారి పడడం వల్ల మెదడుకు గాయమైంది. అప్పటి నుంచి అపస్మారక స్ధితిలో ఉన్న జశ్వంత్‌ తీవ్ర అనారోగ్యానికి గురికావడం వల్ల ఈ ఏడాది జూన్‌ నెల నుంచి దిల్లీలోని సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదయం ఆరోగ్యం విషమించి ఆయన అక్కడే తుది శ్వాస విడిచారు.  కీలక బాధ్యతలు...

  • రాజస్థాన్‌కు చెందిన జశ్వంత్‌ సైనికాధికారిగా పని చేస్తూ రాజకీయాల్లోకి వచ్చేందుకు మధ్యలోనే పదవీ విరమణ చేశారు.  
  • జనసంఘ్‌ నుంచి రాజకీయ ప్రస్ధానాన్ని ఆరంభించిన జశ్వంత్‌ నాలుగు సార్లు రాజ్యసభ సభ్యుడుగా పని చేశారు.
  • మరో నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.  
  • 1980 నుంచి 2014 వరకు పార్లమెంటు సభ్యుడిగా పని చేశారు జశ్వంత్‌ సింగ్‌.  
  • దేశంలో సుదీర్ఘ కాలం ఎంపీగా వ్యవహరించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.

1996లో అటల్‌ బిహారీ వాజ్‌పేయీ నేతృత్వంలో తొలిసారి ఏర్పాటైన భాజపా ప్రభుత్వంలో జశ్వంత్‌.. ఆర్థిక మంత్రిగా పని చేశారు. అనంతరం విదేశాంగ, రక్షణ శాఖలను కూడా నిర్వహించారు. ఆర్థిక మంత్రిగా మార్కెట్‌ అనుకూల సంస్కరణలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. విదేశాంగ మంత్రిగా కూడా భారత దేశ విదేశాంగ విధానంపై జశ్వంత్ సింగ్‌ తనదైన ముద్ర వేశారు. జశ్వంత్ సింగ్‌ కొన్ని రోజుల పాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడుగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2004 నుంచి 2009 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పని చేశారు.  

1999లో నేపాల్‌ నుంచి భారత్‌ వస్తున్న ఎయిరిండియా విమానాన్ని తాలిబన్లు హైజాక్‌ చేసి ఆప్ఘనిస్తాన్‌లోని కాందహార్‌కు తరలించగా ఉగ్రవాదులతో జశ్వంత్‌ సింగ్‌ చర్చలు జరిపారు. భాజపాలో కీలక నాయకుడిగా, వాజ్‌పేయీ, ఎల్‌.కె.ఆడ్వాణీలకు సన్నిహితుడుగా వ్యవహరించారు జశ్వంత్‌ సింగ్‌. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం వల్ల 2009లో భాజపా నుంచి సస్పెండయ్యారు. కొన్ని రోజుల తర్వాత తిరిగి భాజపాలోకి వచ్చినా పార్టీ అభీష్టానికి వ్యతిరేకంగా పని చేయడం వల్ల 2014లో మరో సారి సస్పెండయ్యారు. 2012లో ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్ధిగా పోటీ చేసి హమీద్‌ అన్సారీ చేతిలో ఓడిపోయారు. 2014లో ఇంట్లో స్నానాల గదిలో జారిపడిన ఆయనకు మెదడుకు గాయమైంది. అప్పటి నుంచి ఆయన అపస్మారక స్ధితిలోనే ఉన్నారు. 

08:41 September 27

కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

"సైనికుడిగా, రాజకీయ నేతగా జశ్వంత్‌ సింగ్‌ దేశానికి సేవలు అందించారు. అటల్​ జీ హయాంలో ఎన్నో కీలక మంత్రిత్వ శాఖల బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించారు. ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖలో ఆయన చేసిన సేవలు ఎనలేనివి. ఆయన మృతి తీవ్రంగా బాధించింది.

భాజపా బలోపేతానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన్నుకలసిన క్షణాలు ఎప్పటికీ గుర్తుంటాయి. ఆయన కుటుంబానికి, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి."

    - నరేంద్ర మోదీ, ప్రధాని

మాజీ ప్రధాని వాజ్‌పేయీ హయాంలో రక్షణ, ఆర్థిక, విదేశాంగ శాఖ మంత్రిగా జశ్వంత్‌ సింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. 1980 నుంచి 2014 వరకు పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్నారు జశ్వంత్‌ సింగ్.‌

Last Updated : Sep 27, 2020, 10:47 AM IST

ABOUT THE AUTHOR

...view details