తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఛార్టర్డ్​ అకౌంటెంట్ కావాలనుకుని... - మరణం

అరుణ్ జైట్లీ... విద్యార్థి నేతగా ఏబీవీపీతో అనుబంధాన్ని పెంచుకుని దేశ ఆర్థిక మంత్రిగా ఎదిగిన నేత. తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించిన ఆయన దృఢంగా తయారయ్యేందుకు తోడ్పడిన పరిస్థితులు అనేకం. మంచి రాజనీతిజ్ఞుడిగా ప్రత్యర్థుల ప్రశంసలందుకొన్న ఆయన జీవిత విశేషాల్లో కొన్ని...

ఛార్టర్డ్​ అకౌంటెంట్ కావాలనుకుని...

By

Published : Aug 24, 2019, 12:52 PM IST

Updated : Sep 28, 2019, 2:36 AM IST

అరుణ్ జైట్లీ 1952 డిసెంబర్ 28న దిల్లీలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసమంతా దేశ రాజధానిలోనే సాగింది. సెయింట్ జేవియర్ పాఠశాలలో 1957-69 మధ్య ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. 1973లో శ్రీరామ్ కాలేజీ ఆఫ్ కామర్స్​ నుంచి బీకామ్ హానర్స్ పట్టభద్రుడయ్యారు. దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయ విద్యలో 1977లో ఉత్తీర్ణత సాధించారు.

విద్యార్థి నేతగా...

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్​(ఏబీవీపీ)లో సభ్యుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు జైట్లీ. 1974లో దిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

అవినీతి వ్యతిరేక గళం

అవినీతికి వ్యతిరేకంగా రాజ్​ నారాయణ్​, జయప్రకాశ్​ నారాయణ్ ఉద్యమంలో కీలక నేతగా వ్యవహరించారు జైట్లీ. జయప్రకాశ్​ నారాయణ్ ప్రారంభించిన విద్యార్థి, యువత సమాఖ్యకు జాతీయ కన్వీనర్​గా బాధ్యతలు నిర్వర్తించారు. పౌర హక్కుల ఉద్యమంలో సతీశ్​ ఝా, స్మితూ కొఠారీలతో కలిసి పనిచేశారు.

జైలు జీవితం

విద్యార్థినేతగా ఉన్న జైట్లీ ఎమర్జెన్సీ సమయంలో పీడీ యాక్టు కింద అరెస్టయి 19 నెలల పాటు జైలు జీవితం గడిపారు. విడుదలైన అనంతరం జన​సంఘ్​లో చేరారు.

న్యాయ కోవిదుడు

విద్యాభ్యాసం అనంతరం ఛార్టర్డ్ అకౌంటెంట్ కావాలనుకున్న ఆయన పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయారు. 1987 నుంచి వివిధ హైకోర్టులు, సుప్రీం కోర్టులో న్యాయవాదిగా సేవలందించారు. 1989లో అదనపు సొలిసిటర్ జనరల్​గా సేవలందించారు. బోఫోర్స్ కుంభకోణం విచారణకు అవసరమైన పత్రాల తయారీలో కీలకంగా వ్యవహరించారు. 1990లో సీనియర్ న్యాయవాదిగా దిల్లీ కోర్టు ఆయనకు గుర్తింపునిచ్చింది.

శరద్​ యాదవ్, మాధవరావ్​ సింధియా, ఎల్​కే ఆడ్వాణీ వంటి అగ్రనేతలు, పెప్సికో, కోకా కోలా వంటి కంపెనీల తరఫున అనేక కేసులు వాదించారు.
న్యాయపరమైన అంశాలు, సమకాలీన పరిస్థితులపై పలు పుస్తకాలు రాశారు జైట్లీ. అవినీతి, నేరాలకు సంబంధించిన పరిశోధనా పత్రాన్ని భారత్- బ్రిటిష్ లీగల్ ఫోరమ్​లో సమర్పించారు.

సంగీత సమేత జైట్లీ

జమ్ముకశ్మీర్ మాజీ ఆర్థిక మంత్రి గిరిధారి లాల్ దోర్గా కుమార్తె సంగీతను వివాహమాడారు జైట్లీ. వారికి ఇద్దరు పిల్లలు రోహన్, సొనాలీ. ఇద్దరూ న్యాయవాద వృత్తిలో ఉన్నారు.

ఇదీ చూడండి: ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​.. ఐదుగురు మావోలు హతం

Last Updated : Sep 28, 2019, 2:36 AM IST

ABOUT THE AUTHOR

...view details