మనం గతం నుంచి నేర్చుకోవాలి. అక్కడితో ఆగిపోకూడదు. భవిష్యత్తుపైనా దృష్టి పెట్టాలి. భారత్‌ను తదుపరి స్వర్ణయుగంలోకి తీసుకెళ్లేది విద్య మాత్రమే. సైన్స్, విద్య, పరిశోధన, ఆవిష్కరణ.. ఈ నాలుగు మూల స్తంభాలపై అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అని స్థాయుల్లోనూ విద్యను అందుబాటులోకి తీసుకెళ్లనంతకాలం సైన్స్ పట్ల జిజ్ఞాసను పెంచలేం.
కోల్‌కతాలోని డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో గుమస్తాగా ప్రణబ్ కెరీర్ ప్రారంభించారు. అధ్యాపకుడిగా, జర్నలిస్టుగా కూడా కొద్దికాలం పనిచేశారు. జాతీయోద్యమంలో తన తండ్రి నిర్వహించిన పాత్రతో స్ఫూర్తి పొందిన ప్రణబ్ 1969లో ఇందిర ప్రోత్సాహంతో రాజ్యసభ సభ్యుడిగా పూర్తిస్థాయిలో ప్రజా జీవితంలోకి వచ్చారు...... ప్రణబ్.
అందరికీ ప్రియతముడే..
అందరూ ప్రేమగా ప్రణబ్ దా అని పిలిచే ప్రణబ్ ముఖర్జీ ఎన్నో అత్యున్నత పదవులను అలంకరించి వాటికి వన్నె తెచ్చారు. జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో అత్యున్నత పురస్కారాలను పొందారు. కాంగ్రెస్ పార్టీలో కీలక పదవుల్లో పనిచేసినా ప్రతిపక్షాలను ఒప్పించి, మెప్పించడంలో ఆయన చతురత అనన్య సామాన్యం. ప్రతి పార్టీలోనూ ఆయనకు మిత్రులెందరో.. భారత రాష్ట్రపతిగా, కీలక శాఖలు చేపట్టిన కేంద్ర మంత్రిగా, పార్లమెంటేరియన్‌గా, ఎన్నో అంతర్జాతీయ సంస్థల్లోనూ పనిచేసిన మేధావిగా, విశిష్ట నేతగా ప్రణబ్ ముఖర్జీ అశేష ప్రజల మనసుల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు. దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అందుకున్న ఆయనకు దక్కిన పురస్కారాలన్నింటినీ విఫులంగా చెప్పాలంటే అదో గ్రంథమే అవుతుంది. అంతేకాదు ప్రణబ్ గొప్ప విద్యావేత్త, రచయిత, మంచి వక్త కూడా..
పాలనాదక్షుడాయన..
ఏ పదవిలో ఉన్నా తనదైన ముద్రతో ఉద్దండుడిగా, తిరుగులేని నేతగా కీర్తి ప్రతిష్ఠలు సంపాదించారు. దేశానికి 13వ రాష్ట్రపతిగా పనిచేసిన ఆయన అంతకుముందు కేంద్ర మంత్రివర్గంలో ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలు, వాణిజ్యం వంటి కీలక శాఖలకు మంత్రిగా తనదైన ముద్ర వేశారు. 5 దశాబ్దాల పాటు పార్లమెంటేరియన్‌గా నిరుపమాన సేవలందించారు.
2004-12 మధ్య పరిపాలన సంస్కరణలు; సమాచార హక్కు; ఉపాధి హక్కు; ఆహార భద్రత; ఇంధన భద్రత; ఐటీ; టెలీకమ్యూనికేషన్స్ రంగాల్లోనూ.. విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ, మెట్రోరైళ్ల ఏర్పాటులోనూ ఆయనది కీలకపాత్ర. దాదాపు 95 మంత్రుల బృందాలకు (గ్రూప్స్ ఆఫ్ మినిస్టర్స్) ఆయన నాయకత్వం వహించారు. 1970, 80ల్లో గ్రామీణ బ్యాంకులు, నాబార్డ్ ఏర్పాటులోనూ ఆయనదే ప్రముఖపాత్ర. కేంద్రం, రాష్ట్రాల మధ్య వనరుల పంపకానికి సంబంధించి 1991లో గాడ్గిల్-ముఖర్జీ ఫార్ములా రూపొందించిందీ ఆయనే. దేశానికి సంబంధించిన ఎన్నో సంక్లిష్ట విషయాల్లో అన్ని పార్టీలను ఒప్పించి ఏకాభిప్రాయాన్ని సాధించడంలో ఆయన పాత్ర చాలా గొప్పది. అంతర్జాతీయ సంబంధాలు, ఆర్థిక వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల్లో దిట్ట. భారత ఆర్థిక రంగం, దేశ నిర్మాణంపై అనేక పుస్తకాలు రాశారు. కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన వర్కింగ్ కమిటీలో 23 ఏళ్ల పాటు పనిచేశారు.
ప్రణబ్ దా ప్రస్థానం
- పుట్టిన తేదీ: 1935, డిసెంబరు 11
- స్వగ్రామం: పశ్చిమబెంగాల్‌లోని బీర్భం జిల్లా మిరాటీ.
- తల్లిదండ్రులు: రాజ్‌లక్ష్మీ ముఖర్జీ, కమద కింకర్ ముఖర్జీ (ఈయన స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషించారు.)
- వివాహం: 1957, జులై 13
- భార్య: సువ్రా ముఖర్జీ
- సంతానం: కుమారులు అభిజిత్, ఇంద్రజిత్; కుమార్తె శర్మిష్ఠ.
- విద్యార్హతలు: ఎం.ఎ.(చరిత్ర), ఎం.ఎ.(రాజనీతి శాస్త్రం), ఎల్‌ఎల్‌బీ, డీలిట్.
- రాజకీయ సోపానం
- 1966లో బెంగాల్ కాంగ్రెస్‌లో చేరిక
- 1969, 75, 81, 93, 99లో రాజ్యసభకు ఎన్నిక.
- 1980-85 మధ్య కాలంలో రాజ్యసభానేతగా వ్యవహరించారు.
- పారిశ్రామిక అభివృద్ధి సహాయ మంత్రి (1973-74)
- నౌకాయానం, రవాణా సహాయ మంత్రి (జనవరి 1974- అక్టోబరు 1974)
- ఆర్థికశాఖ సహాయమంత్రి (అక్టోబరు 1974- డిసెంబరు 1975)
- రెవెన్యూ, బ్యాంకింగ్ శాఖ మంత్రి-స్వతంత్రహోదా (1975-1977)
- వాణిజ్యం, ఉక్కు, గనుల శాఖ మంత్రి-కేబినెట్ (1980-82)
- ఆర్థికశాఖ మంత్రి (1982-84)
- ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు (1991-96)
- వాణిజ్యశాఖ మంత్రి (1993-95)
- విదేశాంగ మంత్రి (1995-96)
- 2004లో జాంగీపుర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నిక
- జూన్ 2004 నుంచి లోక్‌సభ నేతగా బాధ్యతలు
- రక్షణశాఖ మంత్రి (2004-06)
- విదేశాంగ శాఖ (2006-09)
- ఆర్థికశాఖ (జనవరి 2009- జూన్ 2012)
- 2012-17: భారత రాష్ట్రపతిగా పనిచేశారు
ఆర్థిక మంత్రిగా విశిష్ట గుర్తింపు
కేంద్ర ఆర్థిక మంత్రిగా ప్రణబ్ చెరగని ముద్ర వేశారు. సరళీకరణలకు ముందూ-తర్వాతా ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తిగా ప్రత్యేకత పొందారు. 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 1984లో ప్రపంచంలోనే ఐదుగురు అత్యుత్తమ ఆర్థిక మంత్రుల్లో ఒకరిగా యూరో మనీ జర్నల్ సర్వేలో గుర్తింపు పొందారు. 2010లో ఆసియాలోనే ‘ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద ఇయర్’గా గుర్తింపు లభించింది.
పురస్కారాలు
- 1997: ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు.
- 2008: పద్మవిభూషణ్
- 2011: భారత ఉత్తమ పాలనాదక్షుడి అవార్డు
- 2019: దేశ అత్యున్నత భారతరత్న పురస్కారం.
పైప్‌తో పొగతాగుతున్న ప్రణబ్ దా! ఒకప్పుడు ప్రణబ్‌కు పైప్‌తో పొగతాగే అలవాటు ఉండేది. అయితే తర్వాత ఆయన ధూమపానానికి పూర్తిగా దూరంగా ఉండటమే కాకుండా.. ఎవరినీ దాని జోలికి పోవద్దని చెబుతుండేవారు.
ఇదీ చదవండి: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు నేడే