గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్(92) గురువారం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అహ్మదాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన ఆసుపత్రిలో చేరారు. అయితే.. కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నప్పటికీ.. ఊపిరితిత్తులు, శ్వాసకోశ సమస్య తీవ్రమవటం వల్ల ఆరోగ్యం క్షీణించి తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.
రెండు సార్లు ముఖ్యమత్రిగా
1928 జులై 24న గుజరాత్‌లోని విసవదార్లో జన్మించారు కేశుభాయ్ పటేల్. గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి 1995లో బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 1998 నుంచి 2001 వరకు ముఖ్యమంత్రిగా సేవలందించారు. గుజరాత్ అసెంబ్లీకి ఆరు సార్లు ఎన్నికయ్యారు. 1980 నుంచి భాజపాలో ఉన్న ఆయన.. 2012లో రాజీనామా చేసి గుజరాత్ పరివర్తన్ పార్టీ పేరుతో సొంత పార్టీ పెట్టారు. చివరిసారిగా 2012లో విసవదార్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ.. ఆరోగ్యం సహకరించకపోవటం వల్ల 2014లో రాజీనామా చేశారు.
ప్రధాని మోదీ సంతాపం..
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ మృతిపట్ల విచారం వ్యక్తంచేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పటేల్... సమాజంలోని ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే గొప్ప నాయకుడని గుర్తు చేసుకున్నారు. తనతో పాటు చాలా మంది యువ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసి.. రాజకీయంగా ఎదిగేందుకు తోడ్పాటు అందించారని కొనియాడారు. ఆయన మృతి తీరని లోటుగా పేర్కొన్నారు. కేశుభాయ్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ట్వీట్లు చేశారు మోదీ.