అరుణాచల్ ప్రదేశ్ తూర్పు సెక్టార్లో... భారత్-టిబెట్లను వేరు చేస్తున్న మెక్‌మోహన్ రేఖకు కేవలం 16 కిలోమీటర్ల దూరంలో చైనా సైన్యం కీలక స్థావరం ఏర్పాటు చేసుకుంది. గతేడాదే టిబెట్‌కు సమీపంలోని యింగ్చీ ప్రాంతంలో ఈ కీలక సైనిక పోస్టు నెలకొల్పింది.
భారత సరిహద్దులోని చివరి అవుట్‌పోస్ట్ అరుణాచల్‌లోని.. టూటింగ్. దానికి సమీపంలోని యింగ్చీ వద్ద ఉన్న బేయి.. 52, 53వ మౌంటేన్ మోటరైజ్డ్ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్లకు కేంద్రంగా ఉన్నాయి. ఇవి రెండూ టిబెట్ మిలిటరీ జిల్లా పరిధిలోనే ఉంటాయి.
ఈ నేపథ్యంలోనే లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు సృష్టిస్తున్న చైనా.. అసలు ప్రణాళికలో భాగంగా అరుణాచల్‌పై దృష్టి సారించింది. భారత్ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) మోహరింపుల్లో భాగంగా.. 77 ఆర్మీ గ్రూపులను, సరిహద్దు పహారా రెజిమెంట్లను రంగంలోకి దించింది.
లాసా-యున్నన్ రహదారికి దగ్గర్లోనే ఉన్నాయి ఈ మోహరింపులు. ప్రధానంగా సైన్యం, సైనిక పరికరాలను తరలించేందుకు ఉపయోగపడే విధంగా ఇక్కడి ప్రాంతాన్ని తీర్చిదిద్దారు. ఇక్కడ మరో కీలకమైన రైల్వే జంక్షన్ కూడా ఏర్పాటు చేశారు.
ఇక మెక్‌మోహన్ రేఖ సరిహద్దు ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూనే.. సైనిక స్థావరాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తుంది డ్రాగన్. వ్యూహాత్మక అవసరాలే లక్ష్యంగా పీఎల్ఏ వేగంగా పావులు కదుపుతోంది. అరుణాచల్ ప్రదేశ్‌కు ద్వారాలుగా ఉన్న పర్వతాలను స్వాధీనం చేసుకునే ఆలోచనలో ఉంది.
1962లో చైనా సైన్యం ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్... తూర్పు, పశ్చిమ ప్రాంతాలైన తవాంగ్, వాల్లాంగ్లోకి చొచ్చుకొచ్చింది. ప్రస్తుతం అరుణాచల్ సరిహద్దుకు సమాంతరంగా ఉన్న లాసా-యున్నన్ రహదారి.. మెక్‌మోహన్ రేఖతో సంధానం చేసే మార్గాలతో అరుణాచల్‌లోకి మరిన్ని మార్గాలు తెరుస్తోంది.
అమెరికాకు చెందిన 'స్ట్రాట్‌ఫర్' మేధావుల అంచనాల ప్రకారం.. దాదాపు 10 వాయుసేన స్థావరాలు సిక్కిం నుంచి అరుణాచల్ మధ్య చైనా వాయుసేన ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 2017 డోక్లాం ఘర్షణల తర్వాతే 7 నెలకొల్పింది. వీటిలో యింగ్చీ సహా మిగతా స్థావరాల్లో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ స్టేషన్లతో సహా అత్యుధునిక సాంకేతికత అందుబాటులోకి తెచ్చింది.