తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​ భేరి: రాజకీయ తెరపై తారాతోరణం - హిందీ

ఎన్నికల వేళ బాక్సాఫీస్​​ వదిలి పోలింగ్​ బాక్స్ వద్ద తలపడుతున్నారు కొంత మంది సినీ ప్రముఖులు. సినిమాల్లో పోరాటాలతో ఆకట్టుకున్న హీరోలు ప్రజాస్వామ్య పోరుకు సన్నద్ధమవుతున్నారు. అద్భుత చిత్రాలతో వసూళ్ల వర్షం కురిపించిన నటీనటులు ఓట్ల కలెక్షన్లలో ఎంతమేరకు రాణిస్తారన్నదే ప్రశ్న.

రాజకీయాల్లో పరీక్షించుకుంటున్న సినీప్రముఖులు

By

Published : Mar 29, 2019, 1:45 PM IST

రాజకీయాల్లో పరీక్షించుకుంటున్న సినీప్రముఖులు
సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేం కాదు. తెలుగులో అంతలా లేకున్నా.. బాలీవుడ్​ తారలు అడపాదడపా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎన్నికల పండుగలో భాగమవుతుంటారు. సునీల్ దత్, వినోద్​ఖన్నా, హేమమాలిని, జయప్రద లాంటి ప్రముఖులు రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకున్నవాళ్లే. సినీ రంగంలో మెప్పించిన నటులు సినిమా జీవితం అనంతరం ఒకానొక దశలో.. రాజకీయాలనే తదుపరి కెరీర్​గా ఎంచుకుంటున్నారు.

ఇదీ చూడండి:రాజకుటుంబీకుల మధ్య రసవత్తర పోరు

కొత్త నాయకులు...

తాజాగా ఈ జాబితాలోకి 'రంగీలా' తార, నిన్నటి తరం కథానాయిక ఊర్మిళా మాతోంద్కర్​ ప్రవేశించారు. దిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. ఉత్తర ముంబయి స్థానం నుంచి... ఈ సినీ నటి లోక్​సభ ఎన్నికల బరిలో నిలిచారు.

"కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరుతున్నాను. అంతే కానీ... ఎన్నికల సమయం కాబట్టి ఈ నిర్ణయం తీసుకోలేదు."

-- ఊర్మిళా మాతోంద్కర్

సల్మాన్​ ఖాన్​, సంజయ్ దత్ ప్రధాన పార్టీల్లో చేరతారంటూ వార్తలొచ్చాయి. కానీ అవి వదంతులేనని కొట్టిపారేశారీ నటులు. ఇటీవల జయప్రద సమాజ్ వాదీ పార్టీను వీడి భాజపాలో చేరారు. ఈ సార్వత్రిక సమరంలో ఉత్తరప్రదేశ్​లోని రాంపుర్​ లోక్​సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు జయప్రద.

బిగ్​ బీ అమితాబ్ బచ్చన్​ 80వ దశకంలోనే రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించారు. తన స్నేహతుడు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తరపున ప్రచారం చేశారు అమితాబ్. అనంతరం బోఫోర్స్ కుంభకోణంలో కాంగ్రెస్​ ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో రాజకీయాలకు దూరమయ్యారు. కానీ.. అమితాబ్ సతీమణి జయాబచ్చన్ క్రియాశీల రాజకీయాల్లో విజయవంతమయ్యారు. జయ​..సమాజ్ వాదీ తరపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ప్రముఖ హిందీ నటుడు రాజ్​బబ్బర్ రాజకీయాల్లో నిలకడ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తర్​ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నటి హేమమాలిని రాజకీయ ప్రయాణంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. 2014లో మథుర నుంచి ఎంపీగా ఎన్నికైన హేమ.. ఈ సారీ బరిలో ఉన్నారు.

ఈ సారి వీరి సినిమా రావట్లేదు...

మోదీ సన్నిహితులైన నటుడు పరేశ్ రావల్ 2014లో అహ్మదాబాద్​​ నుంచి ఎంపీగా గెలుపొందారు. మళ్లీ టికెట్​ వస్తుందనుకున్నా... నిరాశే ఎదురైంది.

మొదట నుంచి భాజపాలో ఉన్న శతృఘ్న సిన్హా ఆ పార్టీని వీడారు. ఈ సారి పట్నా సాహిబ్​ టికెట్​ను భాజపా కేంద్రమంత్రి రవిశంకర్​ ప్రసాద్​కు ఇచ్చినందున కాంగ్రెస్​లో చేరనున్నారీ షాట్​ గన్.

రాజకీయ రంగస్థలంలో మెప్పించిన నటులు

సునీల్ దత్​ ఎంపీగా గెలిచి మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అలనాటి బాలీవుడ్ స్టార్​ వినోద్ ఖన్నా నాలుగు సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిచి కేంద్రమంత్రి అయ్యారు. ప్రముఖ దర్శకుడు ప్రకాశ్ ఝా, నటుడు మహేష్​ మంజ్రేకర్, నటి కిరణ్ ఖేర్ రాజకీయాల్లో అడుగుపెట్టినవాళ్లే.

కాల్షీట్ల కోసం ఒకప్పుడు తీరిక లేకుండా గడిపిన నటులు ఇప్పుడు కాలి బాట పట్టి ప్రజల్ని ఓట్లు అడుగుతున్నారు. రొమాంటిక్ డైలాగ్​లతో మెప్పించిన హీరోలు రోడ్ షోలు చేస్తున్నారు. అభినయంతో అభిమానుల్ని అలరించిన అగ్రతారలు.. అందరినీ ఆకర్షించి అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

ఇవీ చూడండి:

'అన్నీ మాట్లాడతా... ఆ ఒక్కటి మినహా!'

భారత్​ భేరి: రాజకీయం రంగులమయం

ABOUT THE AUTHOR

...view details