అసలే వైరస్ కాలం. దగ్గు, జ్వరం, జలుబు వస్తే.. తొలుత కరోనాగా అనుమానించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలామంది ఆసుపత్రలకు పరుగులు తీస్తున్నారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు 14 రోజులపాటు ఇంటి వద్దే స్వీయ నిర్బంధం (హోం క్వారంటైన్)లో ఉంటున్నారు. బయట తిరగడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో చాలామందిని ఇంటికే పరిమితం చేస్తున్నారు. అప్పటికీ లక్షణాలు తగ్గకపోతే మళ్లీ ఆసుపత్రికి రావాలని సూచిస్తున్నారు. స్వీయ నిర్బంధంలో ఉన్నవారు తీసుకునే ఆహారం, పాటించే ఇతరత్రా జాగ్రత్తలూ వారు త్వరితగతిన కోలుకోవడానికి దోహదం చేస్తాయి. ప్రధానంగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు నమ్మకుండా.. సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత సమయం నిద్ర పోవడం, ఇంట్లోనే కొంతసేపు వ్యాయామం చేసుకోవడం ద్వారా అనారోగ్యం నుంచి త్వరితగతిన కోలుకోవచ్చునని పోషకాహార నిపుణురాలు సుజాత స్టీఫెన్ పేర్కొన్నారు.
వ్యాధి నిరోధక శక్తి పెంచుకోండి..
సమతుల్యం అంటే.. విటమిన్ ఎ, బి, సి, డి, ఐరన్, సెలినీయం, జింక్ ఉండే ఆహారాన్ని సమపాళ్లలో తీసుకోవాలి. ఇందులో ఉండే సూక్ష్మ పోషకాలు వైరల్, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌లతో పోరాడుతాయి. శరీరానికి తగినంత రోగ నిరోధక శక్తిని అందిస్తాయి. ఒంట్లో ఈ శక్తి తగ్గినప్పుడు బయట నుంచి ఇవి దాడి చేసి అనారోగ్యానికి కారణమవుతాయి. మంచి ఆహారం, ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరు తూ.చ. తప్పకుండా అనుసరించడం చాలా ముఖ్యమని సుజాత వివరించారు. ఈ క్రమంలో ఏవి తినాలి.. ఎలాంటి ఆహారానికి దూరంగా ఉండాలనేది చాలా ముఖ్యం. సమతుల ఆహారానికి బదులు.. జంక్‌ఫుడ్, కోలాలు, అధిక చక్కెర ఉన్న పదార్థాలు, ఆల్కహాల్ వంటివి తీసుకుంటే ఇవి శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని అడ్డుకుంటాయి. తద్వారా వైరస్‌లు శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేసే అవకాశాం ఉంది. ఈ నేపథ్యంలో పొగ తాగడం అలవాటు ఉన్న వారు తక్షణం మానుకోవడం మంచిది. లేదంటే ఊపిరితిత్తులు పోరాడే సామర్థ్యాన్ని కోల్పోతాయి.
ఇంటి నుంచి పని చేసేవారు ఇలా..
ముఖ్యంగా కరోనా ప్రభావంతో చాలామంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఇలాంటి వారు తిండిపై కాస్త అశ్రద్ధ చూపే అవకాశం ఉంది. సమయానికి భోజనం చేయకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. లేదంటే ఎక్కువ మోతాదులో తీసుకుంటారు. తద్వారా జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కచ్చితంగా భోజనంలో సమయం పాటించాలి. వీటితోపాటు ఆల్కహాల్, ధూమపానానికి దూరంగా ఉండాలి. ఇంట్లోనే తేలిక పాటి వ్యాయామాలు గంటపాటు చేయాలి. యోగ, ధ్యానం చేయడం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు ఎంతో మేలు చేస్తాయి. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు సమాచారం నమ్మడం మంచిది కాదు.
ఎందులో.. ఏమున్నాయంటే..
విటమిన్ ఎ:వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. కోడిగుడ్డులోని పచ్చ సొన, బాదం, పిస్తా, తృణధాన్యాలు, ఆకు కూరలు,క్యారెట్లలో ఉంటుంది.
విటమిన్ బి: బీ6, బి9, బి12 చాలా అవసరం. ఇవి శరీరంలోని వైరల్,బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లపై సమర్థంగా పోరాడతాయి. చికెన్, చేపలు, గుడ్లు, మటన్, బాదం, శనగలు, బొబ్బర్లు, బీన్స్, పాలలో పుష్కలంగా ఉంటాయి.
విటమిన్ సి:శరీరంలో హానికారక టాక్సిన్లను నిరోధిస్తుంది. కణాలను శుద్ధి చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో కీలక భూమిక పోషిస్తుంది. నిమ్మ, ఆరెంజ్, చెర్రీలు, కివీ, టమోటాల్లో అధికంగా ఉంటుంది.