ఎన్నికల బరిలో 'జొమాటో' డెలివరీ గర్ల్ వినియోగదారుల కోసం ఆహారపదార్థాలను సిద్ధం చేస్తున్న ఈమే పేరు మేఘన దాస్. మంగళూరులోని జొమాటోలో ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. ఆర్డర్ చేసిన ఆహారపదార్థాలను పంపిణీ చేసేందుకు.. రోజూ 200 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తారు. ఈక్రమంలో నగరంలో శిథిలమైన రోడ్ల కారణంగా అనేకసార్లు మేఘన ఇబ్బంది పడ్డారు. వాహనంపై నుంచి కిందపడిన సందర్భాలు అనేకం. వినియోగదారులకు ఆహారాన్ని పంపిణీ చేయడం కూడా ఆలస్యం అయ్యేది. రోడ్ల దుస్థితి గురించి చాలా సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదు. రహదారుల భద్రతపై తీవ్రంగా కలత చెందిన మేఘన.. ఓ స్నేహితుడి సలహా మేరకు మంగళూరు కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి దిగారు.
కాంగ్రెస్ టికెట్‌పై..
మేఘన ఆసక్తిని గమనించిన కాంగ్రెస్ పార్టీ ఆమెకు టికెట్ ఇచ్చింది. మంగళూరు కార్పొరేషన్ ఎన్నికల్లో మన్నగూడ వార్డు నుంచి పోటీ పడుతున్నారు. ఎన్నికల్లో ప్రజలకు దగ్గరయ్యేందుకు తన వృత్తి జీవితాన్నే ఆసరాగా చేసుకున్నారు మేఘన. ఆహారం పంపిణీ చేసే సమయంలో స్థానిక సమస్యల గురించి వినియోగదారులకు చెప్పి.. వారి ఆశీస్సులను అందుకుంటున్నారు. ఎన్నికల్లో గెలిస్తే.. రోడ్ల మెరుగుదల, మహిళల భద్రత, నీటి సమస్యలపై దృష్టి పెడుతానని మేఘన చెబుతున్నారు.
" గతానికి, ఇప్పటికి తేడా ఒక్కటే.. ఇంతకు ముందు ఆహారం డెలివరీ ఇచ్చి రేటింగ్ అడిగే దానిని. ఇప్పుడు మీ ఓటు కావాలని అడుగుతున్నాను.. అంతే తేడా. ఇదే రోడ్డుపైనా ఎన్నో రోజుల నుంచి నీరు నిల్వ ఉంది. దాని వల్ల ఎన్నో రోగాలు వస్తున్నాయి. డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రభలుతున్నాయి. ఇదంతా మార్చేందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను."
- మేఘన దాస్, మన్నగూడ అభ్యర్థి
ఇదీ చూడండి:దూడలకు ఘనంగా వివాహం- కారణం అద్భుతం!