తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వెనక్కి వెళ్లిన చైనా బలగాలు- శుక్రవారం మళ్లీ చర్చలు

సరిహద్దులో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు శుక్రవారం మళ్లీ చర్చలు జరపనున్నాయి భారత్​, చైనా. ఇరు దేశాల పరస్పర అంగీకారం మేరకు తూర్పు లద్దాఖ్​లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఈ భేటీ నిర్వహించనున్నాయి.

Following disengagement, another round of India-China border talks tomorrow
వెనక్కి వెళ్లిన చైనా బలగాలు

By

Published : Jul 9, 2020, 4:58 PM IST

తూర్పు లద్దాఖ్​ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకున్నాయి భారత్​-చైనా. కార్ప్స్​ కమాండర్ స్థాయి చర్చలో కుదిరిన ఏకాభిప్రాయం మేరకు వాస్తవాధీన రేఖ నుంచి వెనక్కి వెళ్లాయి. ఈ ప్రక్రియ పూర్తయిన సందర్భంగా రెండు దేశాలు శుక్రవారం మరోసారి చర్చలు జరపనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. వర్చువల్​ భేటీలో ఇరు దేశాల అధికారులు సమావేశమవుతారు. సరిహద్దులో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ఇంకా చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారు.

ఇరు దేశాల మధ్య కుదిరిన పరస్పర అంగీకారం మేరకు పెట్రోలింగ్ పాయింట్​-15 నుంచి 2 కి.మీ మేర వెనక్కి వెళ్లాయి చైనా బలగాలు. తాత్కాలికంగా నిర్మించిన గుడారాలను కూల్చి వేశాయి. వాహనాలను వెనక్కి తరలించాయి. భారత్​ కూడా బలగాలను 1.5 కి.మీ మేర వెనక్కి రప్పించింది. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన ఇతర ప్రాంతాల నుంచి ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి.

వాస్తవాధీన రేఖ వెంబడి గతంలో ఉన్న స్థితినే కొనసాగించాలని, ఏకపక్ష నిర్ణయాలతో ఎలాంటి మార్పులు చేయొద్దని ఇరు దేశాలు ఇటీవల జరిపిన చర్చల్లో పరస్పర అంగీకారానికి వచ్చాయి. సరిహద్దులో శాంతికి విఘాతం కలగకుండా వ్యవహరించాలని నిర్ణయించాయి. ఈ మేరకే బలగాలను ఉపసంహరించుకున్నాయి.

అయితే గల్వాన్ నదీ తీరంలోని లోతట్టు ప్రాంతాల్లో చైనా మోహరించిన భారీ ఆయుధ వాహనాలను ఇంకా వెనక్కి తరలించలేదని భారత సైనిక వర్గాలు తెలిపాయి. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నాయి.

ఇదీ చూడండి: సరిహద్దులో శాంతి స్థాపన దిశగా భారత్-చైనా!

ABOUT THE AUTHOR

...view details