బిహార్‌లో తొలి దశ ఓటింగ్ సమరం ముగిసింది. 71 స్థానాల్లో అభ్యర్థుల భవితవ్యం నమోదైంది. ఇక నేతల దృష్టంతా రెండో దశ ఎన్నికలు జరిగే సీమాంచల్ మీదికి మళ్లింది. నవంబర్ 3న జరిగే రెండో దశలో కీలకమైన స్థానాల్లో పోలింగ్ జరగనుంది.
సీమాంచల్ పరిధిలోకి వచ్చే పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, దర్భంగా, మధుబని, అరరియా, పూర్ణియా, కిషన్‌గంజ్, కటిహార్, జిల్లాలతో పాటు సమస్తిపుర్, పట్న, వైశాలీ, ముజఫర్‌పుర్ జిల్లాల్లో ఈ విడతలో ఓటింగ్ జరగనుంది.
మలుపుతిప్పనున్న ముస్లిం జనాభా!
ఇందులోని పలు జిల్లాల్లో ముస్లిం జనాభా అధికంగా ఉంది. కిషన్‌గంజ్‌లో అత్యధికంగా 60 శాతం జనాభా ముస్లింలు కాగా.. అరరియాలో 45 శాతం, కాటిహార్లో 40 శాతం, పూర్ణియాలో 30 శాతానికి పైగా ముస్లిం జనాభా ఉంది. లౌకికవాద పేరున్న కారణంగా ఈ నాలుగు జిల్లాలు మహాకూటమికి కలిసొచ్చే అవకాశం ఉంది.
మరోవైపు.. కాంగ్రెస్ నేత తారిక్ అన్వర్, అస్రారుల్ హక్, భాజపాకు చెందిన షానవాజ్ హుస్సెన్‌లు ఇక్కడి రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు కిషన్‌గంజ్‌లో మంచి పట్టున్న మహ్మద్ తస్లీముద్దీన్ సైతం ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
"దక్షిణ బిహార్ ప్రజలతో పోలిస్తే సీమాంచల్ ప్రజల స్వభావం వేరుగా ఉంటుంది. దక్షిణ బిహార్ ఝార్ఖండ్‌తో కలిసి ఉంటుంది. అక్కడి రాజకీయాలు కులాలతో ముడిపడి ఉంటాయి. కానీ సీమాంచల్‌లో మతాల ఆధారంగా ఓట్ల విభజన ఉంటుంది. ఇక్కడి ముస్లిం జనాభా అధికంగా ఉంది. తారిక్ అన్వర్ వంటి నేతలు ఇటీవలే ఎన్సీపీని వదిలి కాంగ్రెస్‌లో చేరారు. ఇది ఆ పార్టీకి బలం చేకూర్చింది. మహ్మద్ తస్లీముద్దీన్ అనుచరులు ఆర్జేడీకి మద్దతిస్తూ వస్తున్నారు."