దిల్లీ నిజాముద్దీన్ తబ్లీగీ జమాత్ వ్యవహారంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, దిల్లీ, తెలంగాణాలో కరోనా కేసులు ఉద్ధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది కేంద్రం.
వైరస్ హాట్స్పాట్లను గుర్తించి... ఆ ప్రాంతాల్లోని వారికి త్వరితగతిన వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. అదే ప్రాంతాల్లో ఐసోలేషన్ వార్డులనూ కేటాయించినట్టు ప్రకటించింది. 24 గంటల్లోనే 8 వేల మందికి పరీక్షలు నిర్వహించింది.
ఒక్క రోజులో..
శుక్రవారం సాయంత్రం చేసిన ప్రకటనలో దేశవ్యాప్తంగా 2,547కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిలో 478 కేసులు ఒక్కరోజులో వెలుగుచుశాయి. దేశంలో మృతుల సంఖ్య 62కు చేరింది.
మహారాష్ట్రపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. శుక్రవారం 67 కొత్త కేసులు నమోదవగా... మొత్తం కేసుల సంఖ్య 490కు చేరింది. తాజాగా మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం వల్ల మొత్తం మరణాలు 26కు చేరాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు.