కర్ణాటకలో రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. దాదాపు 40శాతం వరకు ఉడిపి ప్రాంతం జలమయమైంది. 600కుపైగా ఇళ్లు నీట మునిగాయి. తీవ్ర స్థాయిలో పంటనష్టం వాటిల్లింది. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రంగంలోకి దిగాయి జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు(ఎన్డీఆర్ఎఫ్). లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.
ఉడిపిలో భారీగా ప్రవహిస్తోన్న వరదనీరు.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు వరదల బాధితులకు ఆహారం అందించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో ఆహార సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.
ఇతర జిల్లాల్లోనూ..
రాష్ట్రంలోని కాలబురగి, చిక్కమంగళూరు, విజయపుర ప్రాంతాల్లోనూ వరద బీభత్సం కొనసాగుతోంది. కాలబురగిలో ఓ వంతెన కూలిపోయింది. చిక్కమంగళూరుకు సమీపంలోనున్న తుంగ నది ప్రవాహ ఉద్ధృతి పెరగడం వల్ల.. అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే అక్కడ సుమారు 89వేల హెక్టార్ల పంటలు దెబ్బతిన్నాయి. మహారాష్ట్రలో భారీ వర్షం కారణంగా ఉజని రిజర్వాయర్ గేట్లు ఎత్తివేయడం వల్ల.. విజయపురకు దగ్గరలోని భీమా నది భారీఎత్తున ప్రవహిస్తోంది.
ఇదీ చదవండి:'వ్యవసాయ భారతంలో చారిత్రక మలుపు'