అసోంలో భారీ వర్షాలు, వరదలు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలోని వరద ముంపు ప్రాంతాల్లో కాస్త మెరుగైన పరిస్థితులు కనిపిస్తున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించింది. అయితే.. గురువారం వరదల్లో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 108కి చేరింది.
12 లక్షల మంది..
వరదల తగ్గుముఖంతో బ్రహ్మపుత్ర, దాని పరివాహక ప్రాంతంలోని 22 జిల్లాల్లో వరదల ప్రభావానికి గురైన వారి సంఖ్య 12 లక్షలకు తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. అది బుధవారం నాటికి 17 లక్షలకుపైగా ఉన్నట్లు తెలిపారు. తాజాగా మృతి చెందిన వ్యక్తి మోరిగావూన్ జిల్లాలోని మికిర్భేటా ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. కొండచరియలు విరిగిపడి 26 మంది మృతి చెందారు.