కరోనా దెబ్బతో రెండు నెలలుగా స్తంభించిపోయిన దేశీయ విమానాలు ఎట్టకేలకు సోమవారం నుంచి రెక్కలు కట్టుకుని ఎగిరినా వివిధ కారణాల వల్ల ప్రయాణికులకు మాత్రం చుక్కలు కనిపించాయి. ఏ విమానం వెళ్తుందో, ఏది వెళ్లదో తెలియక వందల మంది అయోమయ పరిస్థితిని ఎదుర్కొన్నారు.
విమానాశ్రయానికి చేరుకుని, బోర్డింగ్ పాసు చూపించిన తర్వాత అసలు ఆ విమానమే లేదని తెలిశాక ఆగ్రహం, ఆవేదనలతో రగిలిపోయారు. సోమవారం తెల్లవారుజాము నుంచి విమానాలు తిరుగుతాయనే సమాచారంతో ఆదివారం రాత్రి నుంచే ఆత్రుతగా నిరీక్షిస్తూ కూర్చొన్నవారిలో అనేకమందికి సర్వీసుల రద్దుతో నిరాశే ఎదురయింది. ప్రత్యామ్నాయం సూచించకుండా, ముందస్తు సమాచారం లేకుండా ఇలా చేశారేమిటని నిలదీశారు.
దిల్లీ- ముంబయికి..
దిల్లీ, బెంగళూరు, ముంబయి, చెన్నై... ఇలా అనేక విమానాశ్రయాల్లో ఇదే పరిస్థితి. విమానాల రద్దుతో దిల్లీ, ముంబయి విమానాశ్రయాల వెలుపల దిక్కుతోచని స్థితిలో అనేకమంది ప్రయాణికులు కనిపించారు. వేర్వేరు చోట్ల చిక్కుకుపోయినవారు విమాన ప్రయాణాలు మొదలయ్యే రోజు కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని నిరీక్షించి, చివరకు ఉసూరుమన్నారు.
దేశీయ విమానాల్లో వచ్చేవారికి ఎన్నాళ్లపాటు ఎక్కడ క్వారంటైన్‌లో ఉంచాలనే విషయంలో కర్ణాటక, తమిళనాడు, కేరళ, బిహార్, పంజాబ్, అసోం తదితర రాష్ట్రాలు భిన్నమైన ప్రమాణాలను నిర్దేశించుకోవడం వల్ల విమానయాన సంస్థలకూ ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. మిగిలినవారు మాత్రం ప్రయాణాలు సాగించగలిగారు. ఈ నెలాఖరులోగా ప్రయాణాలకు సంబంధించి దేశవ్యాప్తంగా దాదాపు 90 వేల మంది టికెట్లు బుక్ చేసుకోవడం విశేషం.
ముంబయి, కోల్‌కతాల నుంచి ఎక్కువ టికెట్లు అమ్ముడయ్యాయి.
నిన్నటి విమానయాన రాకపోకల రాడార్ చిత్రం జాగ్రత్తలు... తరగని క్యూలు
తొలిరోజు అన్ని విమానాశ్రయాల్లోనూ ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. వారి సామాన్ల తరలింపులోనూ ప్రత్యేక జాగ్రత్తలు వహించారు. మాస్కులతో పాటు ముఖాలకు ప్రత్యేక రక్షణ కవచాలు ధరించి సిబ్బంది జాగ్రత్తలు పాటించారు. ప్రయాణికులంతా మాస్కులు, చేతి తొడుగులు ధరించారు.
- ఈశాన్య రాష్ట్రాల్లో గువాహటి, ఇంఫాల్ మినహా మిగిలిన విమానాశ్రయాలేవీ తెరచుకోలేదు. దీంతో వాటికి వెళ్లాల్సిన విమానాలు రద్దయ్యాయి.
- థర్మల్ స్క్రీనింగ్‌ను చేయించుకోవాల్సిన దృష్ట్యా ముంబయి సహా పలు విమానాశ్రయాల్లో పెద్దఎత్తున ప్రయాణికుల క్యూలు కనిపించాయి. ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారో లేదో కూడా భద్రత సిబ్బంది తనిఖీ చేశారు.
ఈ విమానాశ్రయాల్లో ఇదీ పరిస్థితి
- దిల్లీ: వివిధ ప్రాంతాల నుంచి 118 విమానాలు వచ్చాయి. 125 విమానాలు వేర్వేరు గమ్యాలకు బయల్దేరాయి. 82 విమానాలు రద్దయ్యాయి. విమానాశ్రయంలో ప్రయాణికులు బారులు తీరారు. బయల్దేరినవారిలో ఎక్కువమంది సైనికులు, విద్యార్థులు, ప్రత్యేక రైళ్లలో టికెట్లు దొరకనివారు ఉన్నారు.
- ముంబయి: దేశంలో అత్యంత రద్దీగా ఉండే వాటిలో రెండోది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా రోజుకు గరిష్ఠంగా 50 విమానాలనే ప్రస్తుతం నడపనుంది. ఇందులో 25 విమానాలు ఇక్కడి నుంచి వెళ్లేవి, 25 విమానాలు బయటి నుంచి వచ్చేవి. ముంబయి- దిల్లీ ఎయిరిండియా విమానాన్ని ఎలాంటి సమాచారం లేకుండా రద్దు చేయడంతో ప్రత్యామ్నాయం తోచక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
- చెన్నై: ఇక్కడి నుంచి ముంబయికి బయల్దేరాల్సిన కొన్ని విమానాలు రద్దయ్యాయి. తమ సందేహాలకు అధికారులెవరూ సరిగా సమాధానం ఇవ్వలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.
- బెంగళూరు: 60 విమానాలు బయల్దేరాల్సి ఉండగా వాటిలో 30 రద్దయ్యాయి. బెంగళూరు-హైదరాబాద్ విమాన ప్రయాణికులు విమానాశ్రయానికి వచ్చి బోర్డింగ్ పాసులు చూపించిన తర్వాత ఆ సర్వీసు రద్దయిన వారికి విషయం తెలిసింది. విమానంలో బెంగళూరుకు రాగలిగినవారిలో ఐదేళ్ల విహాన్‌శర్మ ఒకడు. మూడు నెలల తర్వాత దిల్లీ నుంచి ఒంటరిగా వచ్చిన బాబును చూసి తల్లి ఉద్విగ్నానికి లోనయ్యారు.
- పుణె: మహారాష్ట్రలోని పుణె నగరం రెడ్‌జోన్‌లో ఉండడంతో క్యాబ్ సేవలు నిలిచిపోయాయి. దీంతో విమానాశ్రయానికి రాకపోకలు చేసేవారు సొంత వాహనాలనో, డయల్-ఎ-రిక్షా సదుపాయాన్నో వాడుకున్నారు.
ప్రముఖ వెబ్‌సైట్ ద్వారా బుక్ అయిన టికెట్లలో 13.6% ఒక్క ముంబయి నుంచే ఉన్నాయి. ఆ నగరానికి చేరుకోవాల్సిన వారు మాత్రం తక్కువగా ఉన్నారు.