పాడుబడిన బావిలో పడిన లేగ దూడను కాపాడేందుకు ప్రయత్నించి విషవాయువు కారణంగా ఐదుగురు యువకులు మృతి చెందిన విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్ గొండాలో జరిగింది. రాజా మోహల్లా ప్రాంతంలోని పాత బావిలో మధ్యాహ్నం ఓ లేగ దూడ పడింది. దాన్ని కాపాడేందుకు నిచ్చెన సాయంతో తొలుత చోటు అనే యువకుడు బావిలోకి దిగాడు. లేగ దూడను పైకి లాగేందుకు ప్రయత్నించాడు. కానీ బావిలో విడుదలైన విషవాయువు కారణంగా చోటు అపస్మారక స్థితిలోకి వెళ్లి బావిలోనే కుప్పకూలాడు. ఎంతకీ బయటకు రాక పోవడం వల్ల.. అతన్ని కాపాడే ప్రయత్నంలో బావిలోకి దిగిన స్నేహితులు ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.
ఐదుగురు యువకులు ఒకేసారి మృతిచెందటంతో గొండాలో విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం తెలిసి ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బావిలోని మృతదేహాలను వెలికి తీశారు. అయితే యువకులు ఏ విషవాయువు వల్ల చనిపోయారనే విషయం ఇంకా నిర్ధరణ కాలేదని గొండా ఏఎస్పీ మహేందర్ కుమార్ తెలిపారు. శవపరీక్ష అనంతరం విషవాయువు గురించి తెలిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.