కరోనా వైరస్ అలియాస్ కొవిడ్-19 అంటే ప్రపంచంలో తెలియని వారు ఉండరేమో. మనిషిని సరిగ్గా ఊపిరి పీల్చుకోనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మిగిలిన వారిని ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండా నిర్బంధంలోనూ పడేసింది. వేల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంటూ.. లక్షల మందిని బాధితులుగా మార్చేస్తోందీ మహమ్మారి. ఇలాంటి పరిస్థితుల్లోనూ కరోనాపై అలుపెరుగక పోరాటం చేస్తున్నాడు మానవుడు.
చైనాలోని వుహాన్ సముద్ర ఆహార మార్కెట్లో ఈ వైరస్ను గతేడాది డిసెంబరులో గుర్తించారు. జంతువుల నుంచి మనుషులకు ఇది సోకినట్లు భావిస్తున్నారు. అయితే కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి.. శ్వాసవ్యవస్థపై పంజా విసిరి ప్రాణాంతకంగా మారింది. ఎంతో మంది దీని గురించి ఆరా తీస్తున్నా.. ఓ ఐదు విషయాలు మాత్రం ఇప్పటికీ పరిశోధకులకు సవాల్ విసురుతున్నాయి.
తక్కువ స్థాయిలోనే లక్షణాలు?
ఏదైనా వ్యాధి సోకినప్పుడు బాధితుడు కొన్ని లక్షణాలతో బాధపడటం సహజం. కానీ కరోనా సోకిన వాళ్లలో 80 శాతం మందికి పెద్ద లక్షణాలేవి కనిపించకపోవడం విచిత్రం. ఈ వైరస్ సోకిన వారికి మొదట జలుబు వస్తుంది. ఆ తర్వాత జ్వరం, దగ్గు, ఛాతీలో నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, వాసన, రుచి కోల్పోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. మిగిలిన 20 శాతం మందిలో మాత్రం విపరీత లక్షణాలు కనిపిస్తున్నాయి. తీవ్రమైన నిమోనియాతో బాధపడుతూ చనిపోతున్నారు. ఈ వ్యాధి కచ్చితమైన లక్షణాలపై ఇప్పటికీ ఓ స్పష్టతకు రాలేకపోయారు పరిశోధకులు.
కరోనా వైరస్ ఎక్కువగా ముక్కు, గొంతుపైనే ప్రభావం చూపిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన కేసుల్లో 60 శాతం బాధితులు ఇవే లక్షణాలతో బాధపడుతుండగా.. ఇందులో ఎక్కువగా వయో వృద్ధులే ఉండటం కలవరపెడుతోంది. వాళ్లలో తక్కువ వ్యాధి నిరోధక శక్తి ఉండటం వల్ల ఎక్కువగా ఈ వైరస్ బారిన పడి మృతి చెందుతున్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు. అయితే ఈ అంశంపైనా ఇప్పటికీ స్పష్టత లేదు.
గాలిలోనూ వ్యాపిస్తుందా?
కరోనా లక్షణాలున్న వ్యక్తి.. దగ్గినా, తుమ్మినా వచ్చే తుంపర్లతో పక్కవారికి ఈ వైరస్ వ్యాపిస్తోంది. అయితే ఇది గాలిలో ఎంతసేపు ఉంటుదన్నది ప్రశ్నార్థకంగా మారింది. న్యూ ఇంగ్లాండ్ అనే జర్నల్లో ప్రచురించిన వ్యాసం ప్రకారం కరోనా గాలిలోనూ మూడు గంటలు ఉంటుంది. అయితే ఆ సమయంలోనూ వైరస్ పక్కవారికి సోకుతుందా? లేదంటే నిర్జీవంగా ఉంటుందా? అనేది ప్రశ్నగానే మిగిలి ఉంది.