రాజ్యసభ షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయని సమాచారం. బడ్జెట్ సమావేశాల్లోని తొలి సెషన్లో రాజ్యసభ కార్యకలాపాలు 13నే ముగుస్తాయని పెద్దలసభ వర్గాలు తెలిపాయి. అఖిలపక్ష సమావేశంలో చర్చించిన తర్వాతే షెడ్యూల్లో మార్పులు చేసినట్లు పేర్కొన్నాయి.
ఫిబ్రవరి 15కు బదులు 13న సభ నిర్వహించాలన్న ఛైర్మన్ వెంకయ్య నాయుడు సూచన మేరకు మార్పులు చేసినట్లు అధికారిక వర్గాల నుంచి సమాచారం. ఇదే విషయంపై అఖిలపక్షం సమావేశంలో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, బడ్జెట్‌పై జరిగే చర్చల్లో సభ్యులంతా తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని అఖిలపక్ష భేటీలో రాజ్యసభ ఛైర్మన్.. నేతలను కోరారని వివరించారు. ప్రతి అంశంపై సభ్యులందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వడం సాధ్యపడక పోవచ్చని అఖిలపక్ష సమావేశంలో ఛైర్మన్ స్పష్టం చేశారని రాజ్యసభ వర్గాలు పేర్కొన్నాయి.