తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు కేబినెట్​ భేటీ.. ఎవరెవరికి ఏ శాఖలు...? - శాఖలు

కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం.. 57 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రివర్గ విస్తరణ పూర్తయిన అనంతరం ఎవరెవరికి ఏ శాఖలు దక్కుతాయోననే ఆసక్తి నెలకొంది.

నేడు కేబినెట్​ భేటీ.. ఎవరెవరికి ఏ శాఖలు...?

By

Published : May 31, 2019, 6:58 AM IST

మోదీ కేబినెట్​ భేటీ.. ఎవరెవరికి ఏ శాఖలు

కేంద్ర మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. మోదీ సహా.. 58 మంది గురువారం రోజు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్​ ఎదుట కార్యక్రమంగా అంగరంగ వైభవంగా జరిగింది. 58 మందితో కూడిన మంత్రివర్గంలో మోదీ సహా 25 మంది కేబినెట్​, 9 మంది స్వతంత్ర హోదా, 24 మంది కేంద్ర సహాయ మంత్రులుగా ఉన్నారు.

ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం నేడు తొలిసారి కేబినెట్​ భేటీ జరిగే అవకాశముంది. ప్రత్యేక అజెండా ఏం లేనప్పటికీ.. పార్లమెంట్​ సమావేశాలు జరిగే తేదీని ఖరారు చేసే అవకాశమున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. రాజకీయ, పార్లమెంటరీ వ్యవహారాలు, భద్రతపై కేబినెట్​ కమిటీలను నియమించే అంశంపై మోదీ దృష్టి సారించనున్నారు.

అయితే.. అంతకుముందే నూతన మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశముంది. కొందరు సీనియర్లకు ఉద్వాసన పలికిన నేపథ్యంలో ఎవరెవరికి ఏ శాఖ అప్పగిస్తారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

తొలిసారి కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన.. అమిత్​ షాకు కీలకమైన ఆర్థిక శాఖ కేటాయిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అనూహ్యంగా మంత్రివర్గంలో చోటు సంపాదించిన జై శంకర్​కు విదేశీ వ్యవహారాల బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

మిగతా సీనియర్లు.. రాజ్​నాథ్​ సింగ్​, రవిశంకర్​ ప్రసాద్​, నిర్మలా సీతారామన్​, నితిన్​ గడ్కరీ, రాం విలాస్​ పాసవాన్​ వారి వారి పాత శాఖల్లోనే కొనసాగే అవకాశముంది.

ప్రొటెం స్పీకర్​గా మేనకా గాంధీ..

భాజపా సీనియర్​ నాయకురాలు, ఎనిమిది సార్లు ఎంపీ మేనకా గాంధీ 17వ లోక్​సభ ప్రొటెం స్పీకర్​గా వ్యవహరించే అవకాశముంది. ఉత్తర్​ప్రదేశ్​ సుల్తాన్​పుర్​ నుంచి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన మేనకాకు కేంద్ర మంత్రివర్గంలో ఈసారి చోటు దక్కలేదు. గత ఎన్డీఏ ప్రభుత్వంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందించారు మేనకా గాంధీ.

కొత్తగా లోక్​సభకు ఎన్నికైన సభ్యులను ప్రమాణం చేయించడం ప్రొటెం స్పీకర్​ విధి. ఇది తాత్కాలిక పదవి మాత్రమే. సాధారణ ఎన్నికల అనంతరం కొత్తగా ఏర్పడిన సభ ​తొలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. స్పీకర్​, డిప్యుటీ స్పీకర్​ ఎంపిక ప్రక్రియను ప్రొటెం స్పీకర్​ హోదాలో ముందుండి నడిపిస్తారు.

ABOUT THE AUTHOR

...view details