ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రఫేల్ యుద్ధవిమానాలు వచ్చే ఏడాది భారత అమ్ములపొదిలో చేరనున్నాయి. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తోన్న 36 రఫేల్ జెట్స్లోని తొలి బ్యాచ్‌లో 4 విమానాలు 2020 మే లో భారత్‌కు రానున్నాయని వైమానిక దళాధిపతి రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా తెలిపారు.
వైమానికదళ అత్యున్నత పదవీబాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి మీడియా సమావేశం నిర్వహించారు భదౌరియా. రఫేల్‌తో పాటు ఎస్-400 క్షిపణి వ్యవస్థ చేరికతో వైమానికదళ యుద్ధ సామర్థ్యం మరితం పటిష్ఠం కానుందని తెలిపారు.
ఎస్-400 క్షిపణి వ్యవస్థ కొనుగోలు కోసం సుమారు 5 బిలియన్ డాలర్లతో 2018 అక్టోబర్‌లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది భారత్.
"ఫ్రాన్స్‌కు ప్రీ డెలివరీ తనిఖీ బృందం వెళ్లనుంది. ఎయిర్‌క్రాఫ్ట్‌కు సంబంధించిన పత్రాలు, ఇతర అనుమతులకు సంబంధించిన పనులను పూర్తి చేస్తుంది. విమానాల అప్పగింతకు ముందే ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇది విమానాల అప్పగింత కాదు.. తనిఖీ ప్రక్రియ పూర్తి చేయటం మాత్రమే. ఈ చర్యలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. గౌరవ రక్షణ మంత్రి పర్యటనలో తొలి విమానాన్ని అందుకుంటారు. మన పైలట్లు ఆ విమానాల్లో ప్రయాణించనున్నారు. ముందుగా మూడింటిని అప్పగించనున్నారు. పైలట్ల పూర్తి స్థాయి శిక్షణ అనంతరం 4 విమానాలను మనకు అప్పగిస్తారు. కానీ అవి భారత్‌కు వచ్చే ఏడాది మే లోనే వస్తాయి. "
- రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా, వైమానిక దళాధిపతి