ఇప్పుడు దేశ ప్రజల దృష్టి అంతా ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య వైపే. వివాదాస్పద అయోధ్య భూ వివాద కేసుపై సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 17లోపు తీర్పు వెలువరించే అవకాశమున్న తరుణంలో అయోధ్యవాసుల్లో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని కొందరు స్థానికులు భయాందోళనకు గురవుతుంటే.. మరికొందరు తీర్పు కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ముందు జాగ్రత్తగా...
తీర్పు తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని ఆశిస్తున్నప్పటికీ.. ముందు జాగ్రత్త చర్యగా నిత్యావసర వస్తువులు, ఔషధాలు కొనుగోలు చేస్తున్నారు కొందరు అయోధ్యవాసులు.
డా. ఇంద్రోనీల్ బెనర్జీకి.. అయోధ్యలో ఓ క్లీనిక్ ఉంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో.. ఇటీవలి కాలంలో అయోధ్య, పరిసర ప్రాంతాల నుంచి తన క్లీనిక్‌కు రోగుల రద్దీ పెరిగిందని తెలిపారు. తీర్పు వెలువడిన అనంతరం తనను కలిసే అవకాశముంటుందో లేదోనని.. రోగులు ముందుగానే 15 రోజులకు సరిపడా మందులు కొనుగోలు చేస్తున్నారని వివరించారు. తాను మాత్రం... అంతా మంచే జరుగుతుందని, భవిష్యత్తు అంతా బాగుంటుందని వారికి చెబుతున్నట్టు స్పష్టం చేశారు.
"అయోధ్యలోని ప్రజలందరూ(హిందువులు, ముస్లింలు) శాంతి కోరుకుంటున్నారు. అయోధ్య అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు. తమ మధ్య ఘర్షణలు చెలరేగవని ధీమాగా ఉన్నారు. అతీత శక్తులు ఘర్షణకు కారణమైతే తప్పా.. ఈ నగరంలో హింస చెలరేగదని నాకు నమ్మకంగా ఉంది."
-- డా. ఇంద్రోనీల్ బెనర్జీ, అయోధ్య వాసి.