విద్యుత్తు పంపిణీ సంస్థలు ఆలస్యంగా చేసే చెల్లింపులపై జెన్‌కో, ట్రాన్స్‌కోలు 12 శాతానికి మించి జరిమానాలు విధించొద్దని కేంద్ర విద్యుత్తు శాఖ రాష్ట్రాలను నిర్దేశించింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి కాలంలో విద్యుత్తు పంపిణీ సంస్థలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి జెన్‌కో, ట్రాన్స్‌కోలు ఈమేరకు చర్యలు తీసుకోవాలని సూచించింది. దీనివల్ల పంపిణీ సంస్థలకు కొంత వెసులుబాటు లభిస్తుందని పేర్కొంది.
'డిస్కంలకు జరిమానా 12శాతానికి మించొద్దు'
డిస్కంల ఆలస్య చెల్లింపులపై 12శాతానికి మించి జరిమానాలు విధించవద్దని జెన్‌కో, ట్రాన్స్‌కోలకు ఆదేశాలు జారీ చెేసింది కేంద్ర విద్యుత్తు శాఖ. కరోనా సంక్షోభ సమయంలో విద్యుత్తు పంపిణీ సంస్థలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించింది.
దేశంలో కొన్నేళ్లుగా వడ్డీ రేట్లను సరళతరం చేసినప్పటికీ డిస్కంలు ఆలస్యంగా చేసే చెల్లింపులపై 18% వార్షిక వడ్డీ మొత్తాన్ని విధిస్తుండటం వల్ల డిస్కంల ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు కేంద్ర విద్యుత్తు శాఖ అభిప్రాయపడింది. కొవిడ్ మహమ్మారి విద్యుత్తు రంగంలోనూ ద్రవ్య లభ్యతను తీవ్రంగా దెబ్బతీసిందని, ఫలితంగా డిస్కంల పరిస్థితి మరింతగా దిగజారిందని పేర్కొంది. ఇప్పటికే కెపాసిటీ ఛార్జీల్లో రాయితీ ఇవ్వడం, లెటర్ ఆఫ్ క్రెడిట్ నిబంధనల్లో వెసులుబాటు కల్పించడం, ద్రవ్యలభ్యత పెంచడం వంటి చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే జూన్ 30వ తేదీ వరకు డిస్కంలు చేయాల్సిన చెల్లింపులపై విధిస్తున్న జరిమానాను గరిష్ఠంగా 12శాతానికి పరిమితం చేయాలని సూచించింది.
ఇదీ చూడండి: కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి? నేడు సీడబ్ల్యూసీ కీలక భేటీ