కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు కురిపించారు. ఐరాస నివేదిక ఆధారంగా దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరుగుతున్నాయని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు.
"నిలిచిపోయిన నియామకాల ప్రక్రియను పునరుద్ధరించాలి. యువతకు ఉపాధి కల్పించాలి. పరీక్షల ఫలితాలను వెల్లడించాలి. యువత ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రభుత్వం పరిష్కారాలు చూపాలి."
- రాహుల్ గాంధీ
పరీక్షలు లేవు.. ఫలితాలు లేవు..
ప్రభుత్వ ఉద్యోగాల నియామకం, ప్రైవేటీకరణపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా తీవ్ర విమర్శలు చేశారు. 'ఎస్ఎస్సీ-సీజీఎల్' పరీక్షల నిర్వహణను పక్కన పెట్టారని ఆరోపించారు.
"ఎస్ఎస్సీ-సీజీఎల్-2017 కింద ఇప్పటివరకు నియామక ఆదేశాలు ఇవ్వలేదు. 2018లో నిర్వహించిన పరీక్షల ఫలితాలు వెల్లడించలేదు. 2019లో పరీక్షలే జరగలేదు. 2020లో ఖాళీలనే గుర్తించలేదు. ఖాళీలు ఉంటే పరీక్షలు ఉండవు.. పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలు రావు. ఫలితాలు వచ్చినా నియామకాలు ఉండవు.
ప్రైవేటీకరణ, ప్రభుత్వ నియామకాల నిలుపుదలతో యువత భవిష్యత్తు నాశనం అవుతోంది. కానీ ప్రభుత్వం అబద్ధపు ప్రచారాలు, ప్రసంగాలతో నిజాలను దాచిపెడుతోంది."
- ప్రియాంక గాంధీ
ఇదీ చూడండి:'వారు ఉన్నంత వరకు గాంధీయేతరులకు నో ఛాన్స్!'