తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'స్వార్థ ప్రయోజనాల కోసమే అయోధ్యపై రివ్యూ పిటిషన్'

అయోధ్య వివాదంపై సమీక్షకు వెళ్లాలన్న అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయాన్ని జాతీయ మైనార్టీ కమిషన్ ఛైర్మన్ ఖండించారు. దీనివల్ల హిందూ-ముస్లిం ఐక్యతకు భంగం వాటిల్లుతుందని అన్నారు. పిటిషన్​ కారణంగా... రామ మందిరాన్ని ముస్లింలు అడ్డుకుంటున్నారనే భావన హిందువుల్లో కలుగుతుందని అభిప్రాయపడ్డారు. రివ్యూ పిటిషన్​ను కచ్చితంగా ధర్మాసనం కొట్టివేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

'స్వార్థ ప్రయోజనాల కోసమే అయోధ్యపై రివ్యూ పిటిషన్'

By

Published : Nov 24, 2019, 3:17 PM IST

అయోధ్య కేసు తీర్పుపై రివ్యూ పిటిషన్ వల్ల​ హిందూ-ముస్లిం ఐక్యతకు భంగం వాటిల్లుతుందని అన్నారు జాతీయ మైనారిటీ కమిషన్ ఛైర్మన్ ఘయోరుల్ హసన్ రిజ్వి. రివ్యూ పిటిషన్​ అనేది ముస్లింలకు ప్రయోజనకరంగా ఉండదని, ఈ చర్య కారణంగా రామ మందిర నిర్మాణాన్ని ముస్లింలు అడ్డుకుంటున్నారన్న సంకేతం హిందువులకు వెళ్తుందని అభిప్రాయపడ్డారు. ముస్లింపక్షాలు వారికి కేటాయించిన అయిదు ఎకరాల స్థలాన్ని స్వీకరించాలని కోరారు.

పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో పలు విషయాలను పంచుకున్నారు రిజ్వి. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత మైనార్టీ కమిషన్ సభ్యులంతా భేటీ అయినట్లు తెలిపారు. అందరూ ఒకే నిర్ణయానికి కట్టుబడి ధర్మాసనం తీర్పును సమర్థించినట్లు చెప్పారు. రివ్యూ పిటిషన్​ వేసినప్పటికీ... కోర్టు 100 శాతం దాన్ని కొట్టివేస్తుందని జోస్యం చెప్పారు.

'ఎవరూ రివ్యూ పిటిషన్ వేయకూడదు. ఎందుకంటే అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు, జమాయిత్ ఉలేమా-ఇ-హింద్ సహా అన్ని పక్షాలు సుప్రీం నిర్ణయాన్ని గౌరవిస్తామని తీర్పునకు ముందే స్పష్టం చేశాయి. ఇప్పుడు మాత్రమే కాదు, సుప్రీం తీర్పు ఏదైనా స్వాగతిస్తామని ఎన్నో ఏళ్ల నుంచి వారు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఈ రివ్యూ పిటిషన్ అవసరం ఏమిటి? ఈ దేశంలోని సాధారణ ముస్లిం పౌరులందరూ ఈ రివ్యూ పిటిషన్​కు వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే సర్దుమణిగిన విషయాన్ని మళ్లీ తెరపైకి తీసుకురాకూడదని వారు కోరుకుంటున్నారు. ఈ రివ్యూ పిటిషన్ ముస్లింల ప్రయోజనం కోసం కాదు. మైనార్టీ కమిషన్ ఛైర్మన్ హోదాలో నేను రోజు ఎంతో మంది ముస్లింలను కలుస్తుంటాను. వారందరూ రివ్యూ పిటిషన్​ వేయకూడదనే చెప్పారు.'
-ఘయోరుల్ హసన్ రిజ్వి, జాతీయ మైనారిటీ కమిషన్ ఛైర్మన్

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ముస్లింలు సహకరించాలని కోరారు రిజ్వి. ప్రతిగా మసీదు నిర్మాణానికి హిందువులు తోడ్పాటు అందించాలని సూచించారు. ఇటువంటి చర్యల ద్వారా సామాజిక సామరస్యాన్ని మరింత ధృఢం చేసుకోవచ్చని చెప్పారు.

ఓట్లకోసమే ఓవైసీ...

ఎంఐఎం నేత అసదుద్దిన్ ఓవైసీ​పై విమర్శనాస్త్రాలు సంధించారు రిజ్వి. ఓవైసీ సహా ముస్లిం పర్సనల్ లా బోర్డులోని నలుగురైదుగురు సభ్యులు రివ్యూ పిటిషన్​కు అనుకూలంగా ఉన్నారని అన్నారు. ముస్లింలను స్వార్థ రాజకీయాలకు ఓవైసీ వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం ఇలాంటి విషయాలపై ప్రజలను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details