ఉత్తర్ప్రదేశ్ హాథ్రస్ అత్యాచారం, హత్య కేసుపై సుప్రీంలో పిల్ దాఖలైంది. సామాజిక కార్యకర్త సత్యమా దుబే సహా మరో ఇద్దరు న్యాయవాదులు.. అత్యున్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దర్యాప్తును సీబీఐ లేదా న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు అప్పగించాలని కోరారు. కేసు విచారణను హాథ్రస్ నుంచి దిల్లీకి బదిలీచేయాలని కోరారు పిటిషనర్లు.
ఇదే సమయంలో ఘటనపై ముగ్గురు సభ్యులతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తు చేస్తుందని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ చేపడుతుందని ప్రభుత్వం పేర్కొంది.
రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా..
హత్యాచార ఘటన బాధితురాలి కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం ప్రకటించింది యోగి సర్కార్. ఒక ఇల్లుతో పాటు కుటుంబీకుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.
అంతకుముందు ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. బాధితురాలి కుటుంబంతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. వారిని అన్ని విధాలా ప్రభు్త్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
మానవహక్కుల సంఘం నోటీసులు..
హాథ్రస్ ఘటనను సుమోటోగా తీసుకున్న జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ).. బాధితురాలి కుటుంబానికి రక్షణ కల్పించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దోషులకు త్వరగా శిక్ష పడేలా చూడాలని డీజీపీకి సూచించింది మానవ హక్కుల సంఘం. 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని యోగి సర్కార్, పోలీసు శాఖకు నోటీసులు జారీ చేసింది.
ఇప్పటికే హాథ్రస్ ఘటనపై పలు రాష్ట్రాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హథ్రస్ సామూహిక హత్యాచార ఘటన బాధితురాలి మృతదేహానికి అర్ధరాత్రి అంత్యక్రియలు నిర్వహించడాన్ని.. వివిధ రాజకీయ పార్టీల నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఎందుకు దహన సంస్కారాలు నిర్వహించారని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ఏదో దాచి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అన్ని వర్గాల నుంచి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురుస్తోంది.