కరోనా మహమ్మారిపై పోరులో దేశ ప్రజలంతా విచక్షణతో వ్యవహరించాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. కొవిడ్ మృతుల అంత్యక్రియల నిర్వహణను కొన్ని ప్రాంతాల్లో స్థానికులు అడ్డుకుంటుండటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అలాంటి ఘటనలు దేశ ప్రతిష్ఠకు, మానవత్వానికి కళంకం తెస్తాయని పేర్కొన్నారు వెంకయ్య. కరోనా బాధితులపైగానీ, మృతుల పట్లగానీ వివక్ష చూపకూడదని సూచించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా 'నా మనోగతం'లో ఆయన ఆదివారం పలు అంశాలను ప్రస్తావించారు.
"కరోనా మృతుల అంత్యక్రియల నిర్వహణలో కులమతాలకు అతీతంగా పలువురు చూపిన చొరవ మరువలేనిది. అయితే- నాణేనికి మరోవైపు అన్నట్లుగా, కొవిడ్ బారిన పడ్డవారిని కొందరు అవమానిస్తున్నారు. అంత్యక్రియల నిర్వహణను అడ్డుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు మానవత్వానికి మచ్చగా మిగిలిపోతాయి. భారతీయ సంస్కృతికి విరుద్ధమైన అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ఆరోగ్య శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా అంత్యక్రియల నిర్వహణకు అందరూ సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా"
-వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి
ప్రాచీన కాలం నుంచి భారత్ సహనానికి పెట్టింది పేరని అన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య. తోటివారి కష్టాలను తమ కష్టంగా భావించి సహాయం చేయడం, సహానుభూతిని కలిగి ఉండటం పూర్వీకుల నుంచి వచ్చిన వారసత్వమని పేర్కొన్నారు. కుల, మత, ప్రాంత, వర్ణ, వర్గాలకు అతీతంగా సమాజంలోని ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా జీవించడమనేది భారతీయుల రక్తంలోనే ఉందని గుర్తు చేశారు.