దిల్లీ అనాజ్ మండీ ప్రాంతంలోని బహుళ అంతస్థుల భవనంలో ఉన్న ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 43 మంది చనిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. కూలీలంతా నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. అందువల్లనే మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. దాదాపు 50 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలానికి చేరుకొని మంటలు ఆర్పే పనిలో నిమగ్నమయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటం వల్ల 30 అగ్నిమాపక శకటాలను రంగంలోకి దించారు. ప్రమాదం జరిగిన ప్రదేశం ఇరుకుగా ఉండటం వల్ల సహాయ చర్యలకు ఇబ్బందికరంగా మారింది.