క్రికెట్... భారతీయుల అభిమాన క్రీడ. కేరళ కలూరు ప్రాంతంలో ఉండే కేఎమ్ విపిన్‌కు అయితే ప్రాణం. "అమేయా ఆర్ట్స్" యజయాని అతడు. అందుకే క్రికెట్‌పై అభిమానానికి, కళా ప్రతిభకు ముడిపెట్టాడు. తన బృందంతో కలిసి క్రికెటర్ల ఫైబర్ విగ్రహాలు అద్భుతంగా రూపొందిస్తున్నాడు.
ఇలా తయారుచేస్తారు
విపిన్ బృందం మొదటగా కొలతలకు తగ్గట్టుగా మట్టితో విగ్రహాలు తయారుచేస్తారు. తరువాత ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో అచ్చుతీస్తారు. దానిలో పీచు పదార్ధాలు నింపుతారు. భారత క్రికెట్ జట్టు జెర్సీని సూచించేలా నీలిరంగు దుస్తులు, బ్యాట్‌తో విగ్రహాలకు తుదిరూపునిస్తారు. ఇదంతా చేయడానికి వారికి సుమారు 15 రోజులు పడుతుంది. ఒక్కో విగ్రహం తయారీకి రూ.50 వేలు వరకు ఖర్చు అవుతుంది.
"క్రికెట్ ప్రపంచకప్ కారణంగా ఈ మధ్య విగ్రహాలకు గిరాకీ పెరిగింది. ఇప్పుడే కాదు ఫుట్‌బాల్ ప్రపంచకప్ జరిగినప్పుడూ విగ్రహాలు తయారు చేశాం. ఇక్కడ క్రికెట్ ప్రేమికులు చాలా ఎక్కువ. డిమాండ్ ఎక్కువ ఉంది. ఈ ఫైబర్ విగ్రహాల ధర కొంచెం ఎక్కువ. ఫైబర్ ఒకటే కాదు పోలీ, థర్మాకాల్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సాయంతోనూ విగ్రహాలు తయారు చేస్తాం. "
- విపిన్, అమేయా ఆర్ట్స్ యజమాని