'దిశ'కు న్యాయం- సజ్జనార్ స్వస్థలంలో సంబరం దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ బృందాన్ని నడిపించిన సారథి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విశ్వనాథ్ సజ్జనార్ స్వస్థలం కర్ణాటక హుగ్లీ. నేడు ఆయన నివాసంలో వేడుకలు ఘనంగా జరిగాయి. మరోసారి సమాజంలోని చీడపురుగులను ఏరిపారేశారంటూ బంధువులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
కొత్తేమీ కాదు..
సజ్జనార్ ఇంట్లో ఇలాంటి వేడుకలు కొత్తేమీ కాదు. ఎందుకంటే ఆయన నాయకత్వంలో జరిగిన ఎన్కౌంటర్ల జాబితా పెద్దదే మరి. అందుకే సజ్జనార్‌ను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటారు.
2015లో హైదరాబాద్‌లో ఐదుగురు ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేసింది విశ్వనాథ్ బృందమే.
2008లో వరంగల్ యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డ ప్రేమోన్మాది శ్రీనివాసరావు సహా అతడి ఇద్దరు స్నేహితుల ఎన్కౌంటర్ ఆయన ఆధ్వర్యంలో జరిగిందే. పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితులపై తుపాకీ గురి పెట్టి కుప్పకూల్చిన ఆ ఘటన ప్రజామోదం పొందింది. ఇప్పుడు అలాంటి దృశ్యమే మళ్లీ దిశ కేసులో పునారవృతం అయ్యింది. అందులోనూ విశ్వనాథ్ కీలక పాత్ర పోషించడం విశేషం.
నిత్యం సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే విశ్వనాథ్ పట్ల ఆయన కుటుంబం గర్వపడుతోంది.
'నా సోదరుడు(సైబరాబాద్ సీపీ సజ్జనార్) విధుల పట్ల అంకితభావం, నిజాయితీ గల వ్యక్తి. ఎప్పుడూ సామాజిక న్యాయం గురించి ఆలోచిస్తారు. సజ్జనార్ 1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయనకు నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఘటనతో దేశం మొత్తం గర్విస్తోంది. అందులో మేము కూడా భాగస్వాములయ్యాం.'
-ప్రకాశ్ సజ్జనార్, సైబరాబాద్ సీపీ సోదరుడు
సజ్జనార్ ప్రయాణం..
కర్ణాటకలోని హుగ్లీకి చెందినవారు విశ్వనాథ్. చన్నప్ప సజ్జనార్, గిరిజమ్మల ఆఖరి సంతానం ఆయన. బాల్యంలోనే తల్లి చనిపోయింది. చిన్నమ్మ మల్లమ్మ దగ్గరే పెరిగారు.
హుగ్లీలోనే లయన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నారు. ఇంటర్, డిగ్రీ జగద్గురు గంగాధర కామర్స్ కాలేజీలో పూర్తి చేశారు. కర్ణాటక విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేశారు. హైదరాబాద్‌లో సివిల్స్ కోచింగ్ తీసుకుని 1996లో యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని కడప పులివెందులలో మొదటిసారిగా బాధ్యతలు చేపట్టారు సజ్జనార్.
ఇదీ చదవండి:నిర్భయ కేసు దోషికి క్షమాభిక్ష నిరాకరణకు కేంద్రం సిఫార్సు