సుష్మాస్వరాజ్ మృతికి సంతాపం తెలిపారు యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ. సుష్మ మంచి వక్తని, గొప్ప పార్లమెంటేరియన్ అని ఉద్ఘాటించారు. సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్‌కు సంతాప లేఖ రాశారు సోనియా గాంధీ. దివంగత నాయకురాలితో తనకు మంచి వ్యక్తిగత సంబంధాలున్నాయని, లోక్‌సభలో సభ్యులుగా ఒకేసారి పనిచేశామని తన లేఖలో పేర్కొన్నారు.
"సుష్మా స్వరాజ్ ఆకస్మిక మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. సుష్మ ఎంతో ప్రతిభాశాలి. తన ధైర్యం, సంకల్పం, అంకితభావం, సామర్థ్యంతో చేప్టటిన అన్ని బాధ్యతల్లోనూ రాణించారు. అన్నింటికి మించి ఆమె వ్యక్తిగత లక్షణాలే ఆమెకు ఎనలేని ప్రాధాన్యతను చేకూర్చాయి."
-సుష్మ కుటుంబానికి రాసిన లేఖలో సోనియా గాంధీ
రాజకీయ జీవితంలో ఎలా ఉన్నారో, వ్యక్తిగత జీవితంలోనూ అదే వైఖరి కొనసాగించారని తన లేఖలో సోనియా స్పష్టం చేశారు. సుష్మ లేని లోటు ఆమె భర్త, కుమార్తెకు తీరని లోటన్నారు సోనియా.