కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటికీ కచ్చితమైన చికిత్స లేదు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా మరో ఔషధం ప్రస్తుతం వాడుతున్న ఔషధాలకంటే పది నుంచి 20రెట్లు ఉత్తమ ఫలితాలు ఇస్తున్నట్లు తేలింది. ఎఫ్‌డీఏ ఆమోదించిన 'టైకోప్లానిన్' ఔషధం కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో సమర్థవంతంగా పనిచేస్తుండడం ఆశలు కల్పిస్తోంది.
దిల్లీ ఐఐటీ ఆధ్వర్యంలో కుసుమ స్కూల్ ఆఫ్ బయోలాజికల్ సైన్స్ ఈ అంశంపై పరిశోధన చేపట్టింది. ఇందులో భాగంగా కరోనా చికిత్సలో ఇప్పటికే వినియోగిస్తోన్న 23 ఔషధాలను పరీక్షించింది. వీటిలో లోపినవిర్, హైడ్రాక్సీక్లోరోక్విన్ కంటే టైకోప్లానిన్ 10-20రెట్ల సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ఐఐటీ దిల్లీకి చెందిన ప్రొఫెసర్ అశోక్ పటేల్ వెల్లడించారు. అశోక్ పటేల్ నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధనలో దిల్లీ ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్ ప్రదీప్ శర్మ కూడా పాల్గొన్నారు.
తాజాగా ఈ పరిశోధన నివేదిక 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ బయోలాజికల్ మ్యాక్రోమాలిక్యూల్స్' లో ప్రచురితమైంది.