తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తండ్రీకొడుకుల లాకప్​డెత్​ కేసులో కీలక నిజాలు వెల్లడి - తమిళనాడులో తండ్రీకొడుకుల లాకప్ డెత్

తమిళనాడులో తండ్రీకొడుకులు జయరాజ్, బెనిక్స్​ లాకప్​ డెత్​ కేసు కీలక మలుపు తిరిగింది. వారిద్దరూ అరెస్టయిన రోజు రాత్రంతా పోలీసులు తీవ్రంగా కొట్టి హింసించారని మహిళా కానిస్టేబుల్ రేవతి వాంగ్మూలం ఇచ్చారు. లాఠీలపై, ఓ టేబుల్​పై రక్తపు మరకలు ఉన్నాయని ఆమె తెలిపారు.

Father-Son duo thrashed all night
లాకప్​ డెత్​ కేసు

By

Published : Jul 1, 2020, 1:33 PM IST

తమిళనాడులో సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల లాకప్​ డెత్​ కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. జయరాజ్​, అతని కుమారుడు బెనిక్స్ అరెస్టయిన తర్వాత రాత్రంతా సత్తానుకులం పోలీసులు తీవ్రంగా కొట్టినట్లు మహిళా కానిస్టేబుల్​ రేవతి వెల్లడించారు.

ఈ కేసుకు సంబంధించి మద్రాసు హైకోర్టు నియమించిన జుడీషియల్ మేజిస్ట్రేట్​కు హెడ్​ కానిస్టేబుల్ రేవతి 4 పేజీల నివేదిక అందించారు. రేవతితోపాటు ఆమె కుటుంబానికి భద్రత కల్పించాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. ఆ తర్వాతే తన వాంగ్మూలంపై సంతకం చేశారు రేవతి.

"లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘించినందుకు జూన్​ 19న జయరాం, బెనిక్స్​ అరెస్టయ్యారు. ఆ రోజు రాత్రంతా కొంతమంది పోలీసులు వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. లాఠీలతో ఓ టేబుల్​పై రక్తపు మరకలు ఉన్నాయి. ఆ మరకలను తొలగించకముందే సేకరించాలి."

- రేవతి వాంగ్మూలం

పోలీసుల తీరుపై..

అనంతరం రేవతి వాంగ్మూలం సహా దర్యాప్తు వివరాలను హైకోర్టుకు సమర్పించారు మేజిస్ట్రేట్​. అయితే విచారణ సమయంలో సత్తానుకులం పోలీసులు సహకరించలేదని మేజిస్ట్రేట్ ఆరోపించారు. జూన్​ 28న విచారణ కోసం వెళ్లగా తనను భయపెట్టేలా ప్రవర్తించారని చెప్పారు.

"చాలా సార్లు అడిగితే తప్ప వివరాలు అందించలేదు. లాఠీలు ఇవ్వమని అడినప్పుడు అందులో ఒక అధికారి గోడ దూకి పారిపోయాడు. మరొకరు నన్ను భయపెట్టేలా బాడీ లాంగ్వేజ్ ప్రదర్శించాడు. ఓ కానిస్టేబుల్​ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. నిజం చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రేవతిని కూడా బెదిరించారు."

- మేజిస్ట్రేట్

ఈ విషయంలో ఏఎస్​పీ డి.కుమార్, డీఎస్​పీ ప్రతాపన్, కానిస్టేబుల్ మహారాజన్​కు హైకోర్టు సమన్లు జారీ చేసింది. ఈ మేరకు ముగ్గురు అధికారులు మంగళవారం కోర్టు ఎదుట హాజరయ్యారు. అధిక ఒత్తిడికి గురికావటం వల్ల మేజిస్ట్రేట్​పై తప్పుగా ప్రవర్తించానని కానిస్టేబుల్ వివరణ ఇచ్చాడు.

సీసీటీవీ దృశ్యాల గురించి..

సీసీటీవీ నిర్వహణపైనా మేజిస్ట్రేట్ కోర్టుకు నివేదించారు. హార్డ్​డిస్క్​ సామర్థ్యం 1టీబీ ఉన్నా ఒక రోజు తర్వాత దృశ్యాలు వాటంతట అవే డిలీట్​ అయ్యేలా సెట్టింగ్స్ చేశారని ఆరోపించారు.

ఆధారాలు మాయం చేయటానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఇప్పటికే హైకోర్టు వ్యాఖ్యానించింది.

అయితే జయరాజ్​, బెనిక్స్ ఇద్దరూ తమనుతాము గాయపరుచుకున్నారని సత్తానుకలం పోలీసులు తొలుత వాదించారు. అరెస్ట్ చేస్తున్న సమయంలోనూ తమపై దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపించారు.

సీబీఐ విచారణకు..

లాక్​డౌన్ నిబంధనలను అతిక్రమించి.. వారి సెల్​ఫోన్ దుకాణాన్ని తెరిచినందుకు పి. జయరాజ్, బెనిక్స్​ను అరెస్ట్ చేశారు తమిళనాడు పోలీసులు. అనంతరం వారు కస్టడీలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై కారణమైన ఇద్దరు ఎస్​ఐలను, నలుగురు పోలీసు సిబ్బందిని ఇప్పటికే సస్పెండ్ చేశారు.

ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సీబీఐ ఛార్జి తీసుకునే వరకు సీబీ- సీఐడీతో విచారణ జరపాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది.

రజినీకాంత్ ఆగ్రహం..

ఈ ఘటనపై సూపర్​స్టార్​ రజినీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ సమయంలో మేజిస్ట్రేట్​పై దురుసుగా ప్రవర్తించడాన్ని తప్పుబడుతూ కోపంతో ఉన్న తన ఫొటోను షేర్ చేశారు.

"తండ్రీకొడుకులను చిత్రహింసలు పెట్టి చంపడాన్ని దేశమంతా వ్యతిరేకిస్తోంది. కానీ, మేజిస్ట్రేట్ విచారణ సమయంలో పోలీసుల దురుసు ప్రవర్తన నన్ను విస్మయానికి గురిచేసింది. ఈ కేసుతో సంబంధమున్న ప్రతి ఒక్కరికి తగిన శిక్ష పడాలి. ఎవర్నీ విడిచిపెట్టకూడదు."

- రజినీకాంత్

ఇదీ చూడండి:'అక్కడ జార్జి ఫ్లాయిడ్.. ఇక్కడ జయరాజ్​-బెనిక్స్​'

ABOUT THE AUTHOR

...view details