వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కొడుకుతో మాట్లాడుతున్న రవిచంద్రన్ ఇరవై ఎనిమిదేళ్ల క్రితం శ్రీలంకలో జరిగిన అల్లర్లలో చాలా మంది తమిళ శరణార్థులు పొట్ట చేతపట్టుకుని భారత్‌కు వచ్చారు. ఆ సమయంలో వచ్చినవాడే కె.రవిచంద్రన్. అప్పుడు తన కుమారుడిని చెన్నైలోని ఓ మిషనరీ పాఠశాలలో చేర్పించాడు. 2013లో పని నిమిత్తం స్వదేశానికి వెళ్లాడు రవిచంద్రన్. ఏడాది తర్వాత వచ్చి చూడగా తన కుమారుడు కనిపించకుండా పోయాడు.
అప్పటి నుంచి కుమారుని కోసం వెతకని చోటు లేదు. కొడుకు సమాచారం కోసం అడగని మనిషి లేరు. ఈ క్రమంలో ఒడిశా మల్కాన్‌గిరి జిల్లాలో నివాసం ఉంటూ కుమారుడి కోసం వెతుకుతూ జీవనం సాగిస్తున్నాడు రవిచంద్రన్.
మల్కాన్‌గిరి జిల్లా లా సర్వీస్, రెడ్‌క్రాస్ సంస్థల సహకారంతో ఐదేళ్ల తర్వాత కుమారుడి ఆచూకీ తెలిసింది. నెదర్లాండ్స్‌లో ఉన్నట్లు గుర్తించిన అధికారులు రవిచంద్రన్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడించారు. ఆ సమయంలో తండ్రి సంతోషానికి అవధుల్లేవు. ప్రస్తుతం అతని కుమారుడు నెదర్లాండ్స్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య అభ్యసిస్తున్నాడు.
ఇదీ జరిగింది...
1990లో లంకలో జరిగిన అల్లర్లతో భారత్‌కు వచ్చాడు రవిచంద్రన్. ఒడిశా మల్కాన్‌గిరి జిల్లాలో నివాసం ఏర్పరుచుకున్నాడు. 1993లో తన భార్య మరణించింది. ఆ తర్వాత మల్కాన్‌గిరి నుంచి చెన్నై వచ్చిన ఆయన.. తన కొడుకును చెన్నై మిషనరీ పాఠశాలలో చేర్పించాడు. అనంతరం 2013లో శ్రీలంకకు తిరిగివెళ్లాడు. తన కొడుకు పాఠశాలలో క్షేమంగా ఉన్నాడని అనుకున్నాడు. ఏడాది తర్వాత 2014లో తిరిగి వచ్చాడు. కానీ... అక్కడ కుమారుడు కనిపించలేదు. తాజాగా ఐదేళ్ల అనంతరం.. తన కొడుకు నెదర్లాండ్స్‌లో ఉన్నట్లు తెలిసింది. కానీ.. అక్కడికి ఎలా వెళ్లాడో తెలియరాలేదు.
తండ్రిని నెదర్లాండ్స్ పంపించాలా లేక కొడుకును భారత్ రప్పించాలా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని జిల్లా న్యాయ సేవా విభాగం తెలిపింది.
ఇదీ చూడండి: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే: పవార్