జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా గృహ నిర్బంధానికి 7 నెలల తర్వాత తెరపడింది. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ప్రజా భద్రతా చట్టం కింద విధించిన గృహ నిర్బంధాన్ని ఎత్తివేసింది జమ్ముకశ్మీర్ అధికార యంత్రాంగం.
ఇక దిల్లీకి వెళ్లి...
220 రోజుల తర్వాత శ్రీనగర్‌లోని తన నివాసం నుంచి బయటకు వచ్చారు ఫరూఖ్. నిర్బంధంలో ఉన్న తన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ సహా ఇతరులను విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
"నేను స్వేచ్ఛ పొందాను. నా స్వేచ్ఛ కోసం పార్లమెంట్లో ఎందరో పోరాడారు. ఇప్పుడు నేను దిల్లీకి వెళ్లి పార్లమెంట్లో ప్రజల గళం వినిపిస్తాను. నేను మీ ముందు ఓ స్వతంత్రుడిగా మాట్లాడుతున్నా. కానీ, ఇది అసలైన స్వతంత్రం కాదు. ఇప్పటికీ నిర్బంధంలో ఉన్న ఎందరో నేతలను విడుదల చేయాలి. వాళ్లందరికీ విముక్తి దొరికే వరకు నేను ఎలాంటి రాజకీయ నిర్ణయాలు తీసుకోను. నన్ను విడుదల చేయించేందుకు పోరాడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు."
-ఫరూఖ్ అబ్దుల్లా, మాజీ ముఖ్యమంత్రి
అధికరణ 370 రద్దు తర్వాత ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఫరూఖ్‌పై పోలీసులు నిర్బంధం విధించారు. మొదట 2019 సెప్టెంబర్ 15న అబ్దుల్లాపై ప్రజా భద్రతా చట్టాన్ని విధించిన కేంద్రం... డిసెంబర్ 13న మూడు నెలలు పొడిగించింది. ఫలితంగా 82 ఏళ్ల వయసులో ఫరూఖ్ అబ్దుల్లా ఏడు నెలలపాటు గృహ నిర్బంధంలోనే ఉండాల్సి వచ్చింది.