తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతులకు, కేంద్రానికి కుదరని సయోధ్య- 8న మళ్లీ చర్చలు - కేంద్రం చట్టాలు

Farmers' stir LIVE: Govt to hold seventh round of talks with farmer unions today
చర్చల కోసం విజ్ఞాన్ భవన్ చేరుకున్న రైతులు

By

Published : Jan 4, 2021, 1:06 PM IST

Updated : Jan 4, 2021, 5:55 PM IST

17:53 January 04

రైతు సంఘాల నేతలతో కేంద్రం చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సాగు చట్టాలు రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాల నేతలు పట్టుబట్టిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు. ఈనెల 8న మరోసారి భేటీ కావాలని కేంద్ర మంత్రులు, కర్షకులు నిర్ణయించారు.

17:33 January 04

మళ్లీ అసంపూర్తిగానే..!

కేంద్రం దిగిరావట్లేదు.. రైతులు పట్టువీడట్లేదు.. ఫలితంగా సాగు చట్టాలపై ప్రతిష్టంభన వీడేలా కన్పించట్లేదు..! కేంద్రం, రైతు సంఘాల నేతల మధ్య సోమవారం జరిగిన ఏడో విడత చర్చల్లోనూ ఎలాంటి పరిష్కారం లభించే అవకాశాలు కన్పించట్లేదు. కొత్త చట్టాలను రద్దు చేసేందుకు కేంద్రం అంగీకరించలేదని సమాచారం. మరోవైపు కేంద్రం ప్రతిపాదనలకు రైతు నాయకులు కూడా ఒప్పుకోవట్లేదని తెలుస్తోంది. 

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలతో కేంద్రం నేడు మరోసారి సమావేశమైంది. 40 మంది రైతు సంఘాల ప్రతినిధులతో ముగ్గురు కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయల్‌, సోం ప్రకాశ్‌ రెండు గంటల పాటు చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలకు కూడా కొలిక్కి రాలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. 

సాగు చట్టాలను రద్దు చేసే ప్రసక్తి లేదని, అయితే చట్టాల్లో సవరణ చేస్తామని కేంద్రమంత్రులు చెప్పినట్లు తెలుస్తోంది. దీన్ని రైతు ప్రతినిధులు తిరస్కరించినట్లు సదరు వర్గాలు చెబుతున్నాయి. తమ డిమాండ్లకు కట్టుబడి ఉన్నామని, చట్టాల రద్దుతో పాటు కనీస మద్దతు ధరపై చట్టబద్ధ హామీ ఇస్తేనే ఉద్యమాన్ని విరమిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. 

16:25 January 04

  • భోజన విరామం తర్వాత చర్చలు పునఃప్రారంభం..
  • కేంద్రం, రైతు సంఘాల మధ్య కొనసాగుతున్న చర్చలు
  • భోజన విరామం తర్వాత తిరిగి చర్చలు ప్రారంభం
  • కొత్త సాగు చట్టాల రద్దు చేసేందుకు ససేమిరా అంటున్న కేంద్రం
  • చట్టాల్లోని ప్రతి క్లాజుపై చర్చించాలని కోరుతున్న ప్రభుత్వం
  • అభ్యంతరాలపై అవసరమైన సవరణలకు సిద్ధమని సంకేతం
  • సవరణలతో రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని రైతు సంఘాల వాదన
  • ప్రభుత్వం పాత పాటే పాడుతోందని ఆరోపిస్తున్న రైతు సంఘాలు
  • సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని పట్టుబడతున్న రైతు సంఘాలు
  • తమ విజయం తథ్యం, కాకపోతే తేదీయే తెలియదంటున్న రైతు సంఘాల ధీమా
  • సాగు చట్టాల రద్దుతో పాటు కనీస మద్ధతు ధరకు చట్టం తెచ్చేవరకు వెనక్కి వెళ్లబోమని స్పష్టం చేసిన రైతు సంఘాలు

15:48 January 04

భోజన విరామం..

రైతు సంఘాలతో కేంద్రం ఏడో విడత చర్చల్లో భోజన విరామం తీసుకున్నారు. రైతులు తమవెంట తెచ్చుకున్న ఆహారాన్ని తీసుకున్నారు. దిల్లీ విజ్ఞాన్​భవన్​లో చర్చలు జరుగుతున్నాయి. 

15:04 January 04

రైతులకు మౌనం..

రైతులతో కేంద్రం ఇవాళ ఏడో విడత చర్చలు జరుపుతోంది. సమావేశానికి ముందు.. నిరసనల సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రైతులకు ఈ సందర్భంగా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు కేంద్ర మంత్రులు, అన్నదాతలు.  

14:46 January 04

రైతులతో కేంద్రం చర్చలు..

  • విజ్ఞాన్ భవన్​లో రైతు సంఘాలు, కేంద్రం మధ్య ఏడో విడత చర్చలు ప్రారంభం
  • 40 రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్, సోమ్ ప్రకాష్ చర్చలు
  • చనిపోయిన రైతులకు శ్రద్ధాంజలి ఘటించిన మంత్రులు, రైతు సంఘాల నేతలు
  • కొత్త సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్దత అంశాలపై చర్చ
  • సాగు చట్టాలు రద్దు చేయాల్సిందేనని పట్టుబడుతున్న రైతులు
  • పంటల మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలంటున్న రైతులు
  • గతంలో రెండు అంశాలపై కుదిరిన ఏకాభిప్రాయంపై కేంద్రం లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలంటున్న రైతులు
  • చట్టాల్లో అభ్యంతరాలపై అంశాల వారీగా చర్చిస్తామంటున్న కేంద్రం
  • రైతుల సమస్యకి సహేతుక పరిష్కారం చూపిస్తామంటున్న కేంద్రం
  • నేటి చర్చలు ఫలప్రదం అవుతాయని భావిస్తున్న కేంద్ర వర్గాలు
  • చర్చలు విఫలమైతే ఆందోళనలు తీవ్రతరం చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్న రైతు సంఘాల నేతలు

14:05 January 04

కేంద్రం, రైతు సంఘాల మధ్య ఏడో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. విజ్ఞాన్ భవన్‌లో ఈ చర్చలు జరుగుతున్నాయి. కొత్త సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధర అంశాలపై చర్చ జరగనుంది. 

12:56 January 04

రైతులతో కేంద్రం చర్చలు- భోజన విరామం

వ్యవసాయ చట్టాలపై కేంద్రంతో ఏడో విడత చర్చలు జరిపేందుకు రైతు సంఘాల ప్రతినిధులు విజ్ఞాన్ భవన్​కు చేరుకున్నారు. మ. 2 గంటలకు కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి. సాగు చట్టాల రద్దు, మద్దతు ధరకు చట్టబద్ధతపైనే చర్చించాలని రైతు సంఘాలు పట్టుపడుతున్నాయి. చట్టాల రద్దు ప్రక్రియను ప్రారంభించాలని కోరుతున్నాయి.

మరోవైపు, సాగు చట్టాలపై అంశాల వారీగా చర్చిస్తామని కేంద్రం చెబుతోంది. గత చర్చల్లో రెండు అంశాలపై ఏకాభిప్రాయం కుదరగా.. తాజా చర్చల్లోనూ సమస్యకు సహేతుక పరిష్కారం చూపిస్తామని హామీ ఇస్తోంది.

కీలకంగా నేటి చర్చలు

డిమాండ్లకు కేంద్రం సానుకూలంగా స్పందించకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. చర్చలు సఫలం కాకుంటే జనవరి 6న ట్రాక్టర్ ర్యాలీ, జనవరి 13న లోహ్రి పండుగ సందర్భంగా కొత్త సాగు చట్టాల కాపీలను దహనం చేస్తామని వెల్లడించాయి.

జనవరి 23న నేతాజీ జయంతి సందర్భంగా 'కిసాన్ దివస్', జనవరి 26న దిల్లీలోకి ప్రవేశించి ట్రాక్టర్లతో భారీ గణతంత్ర పరేడ్ చేస్తామని రైతు సంఘాలు హెచ్చరించాయి. కేంద్రం పంతానికి పోకుండా చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా చర్చలు కీలకం కానున్నాయి.

Last Updated : Jan 4, 2021, 5:55 PM IST

ABOUT THE AUTHOR

...view details