వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమ పోరాటం శాంతియుతంగా కొనసాగుతోందని రైతు నాయకులు స్పష్టం చేశారు. కేంద్రం కొత్త చట్టాలు వెనక్కి తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పారు. పోరాటాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను తిప్పి కొడతామని హెచ్చరించారు. శాంతియుతంగానే పోరాటాన్ని విజయతీరాలకు తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డిసెంబర్ 14న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దిల్లీ, హరియాణా, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జిల్లా ప్రధాన కార్యాలయాల ముందు రోజంతా నిరసనలు చేపట్టాలని నిర్ణయించాయి. ఇతర రాష్ట్రాల్లోనూ ఆ రోజు నుంచే నిరవధిక నిరసనలు చేపడుతున్నట్లు రైతు సంఘాలు పేర్కొన్నాయి. డిమాండ్లు పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించాయి.
"14వ తేదీన సింఘూ సరిహద్దులో రైతు సంఘాల నేతలు నిరాహారదీక్ష చేపడతారు. రేపు రాజస్థాన్ షాహజాన్పూర్ నుంచి వేలాది రైతులు ట్రాక్టర్లతో ర్యాలీగా దిల్లీ వస్తారు. దిల్లీ-జైపుర్ రహదారిని దిగ్బంధిస్తారు. డిసెంబర్ 19లోపు కేంద్రం మా డిమాండ్లకు అంగీకరించకుంటే ఆమరణ నిరాహారదీక్ష చేపడతాం."
-రైతు సంఘాలు
ప్రభుత్వంతో చర్చలు కొనసాగించేందుకు తాము సిద్ధమని.. అయితే ప్రధాన డిమాండ్ మాత్రం చట్టాల ఉపసంహరణే అని స్పష్టం చేశారు రైతు నాయకులు. దీనిపై చర్చించిన తర్వాతే వేరే అంశంపై దృష్టిసారిస్తామని తెలిపారు.
తోమర్ చర్చలు
తోమర్‌తో రైతు సంఘాల నేతల భేటీ మరోవైపు హరియణా రైతు సంఘాల నేతలతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ భేటీ అయ్యారు. కొత్త సాగు చట్టాలపై నేతలతో చర్చిస్తున్నారు. రైతు సాధికారత కోసమే కేంద్రం కొత్త సాగు చట్టాలను తెచ్చినట్లు మంత్రి వివరించారు.
నిరసనలు ఉద్ధృతం
సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన ఉద్ధృతమైంది. భారీగా మంచు కురుస్తున్నా 17వ రోజూ అన్నదాతలు ఆందోళన పంథా వీడలేదు. సాగు చట్టాల ఉపసంహరణకు కేంద్రం సమ్మతి తెలపకపోవడం వల్ల ఆందోళనను తీవ్రతరం చేశారు. మోదీ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఉద్యమ కేంద్రాలైన దిల్లీ సరిహద్దు ప్రాంతాలు మార్మోగుతున్నాయి. దిల్లీ సరిహద్దులోని టోల్‌ప్లాజాలు మూసేసి.. వాహనాలను ఎలాంటి రుసుములు లేకుండానే పంపిస్తూ రైతులు నిరసన తెలిపారు.
హరియాణాలోని ఓ టోల్ ప్లాజా వద్ద రైతుల ఆందోళన దిల్లీ-జైపుర్ జాతీయ రహదారిని అన్నదాతలు దిగ్బంధించగా.. హరియాణా అంబాలాలోని టోల్‌ప్లాజాను, హిసార్- దిల్లీ జాతీయ రహదారిపై ఉన్న మయ్యడ్ టోల్ ప్లాజాను మూసేశారు. దిల్లీ సరిహద్దుల్లోని సింఘూ ప్రాంతంలోనూ... రైతుల ఆందోళన ఉద్ధృతంగా సాగుతోంది.
టోల్ ప్లాజా వద్ద పోలీసుల భద్రత మద్దతు ధర ఇవ్వండి
మరోవైపు, తమకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)పై హామీ కావాలని ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ ప్రతినిధి సర్దార్ వీఎం సింగ్ డిమాండ్ చేశారు. ఎంఎస్పీ కింద తమ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని, దీనికి సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే రైతులకు ప్రయోజనరంగా ఉంటుందన్నారు. బంగాళాదుంపలు, చెరుకు, ధాన్యాలు, కూరగాయలు పాలతో సహా రైతులు పండించే పంటలన్నింటికీ మద్దతు ధర ఇవ్వాలన్నారు. ఈ హామీని రాతపూర్వకంగా ఇవ్వాలని తాము కోరుకోవడం లేదని.. ఎంఎస్పీకి ఒక చట్టం కావాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను ఉప సంహరించుకునే వరకూ ఆందోళన విరమించేది లేదని అన్నదాతలు స్పష్టం చేశారు.
హరియాణా నుంచి దిల్లీ సరిహద్దుకు చేరుకుంటున్న రైతులు పలు రాష్ట్రాల్లోనూ
రైతు సంఘాల పిలుపు మేరకు పలు రాష్ట్రాల్లో కర్షకులు ఆందోళనకు దిగారు. దిల్లీ-ఉత్తర్‌ప్రదేశ్ సరిహద్దులోని ఘాజీపుర్‌లో మహిళా రైతులు రోడ్లపైకి వచ్చి నిరసనకు దిగారు. పిల్లలతో సహా రోడ్లపైకి వచ్చి.. కేంద్ర ప్రభుత్వం తక్షణమే సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నోయిడాలో జెవార్ టోల్‌ప్లాజా, అంబేడ్కర్ మెమోరియల్ పార్కులో రైతులు ఆందోళనకు దిగారు. తక్షణమే సాగు చట్టాలను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా శిరోముండనం చేయించుకున్న రైతులు.. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో వామపక్ష పార్టీలు రైతులకు సంఘీభావంగా ఆందోళన చేశాయి.
డ్రోన్ల నిఘా
నిరసన ప్రాంతంలో బలగాల రెండంచెల భద్రత జాతీయ రహదారుల దిగ్బంధం, టోల్ ఫ్లాజాల వద్ద నిరసన తెలపాలన్న రైతు సంఘాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దిల్లీకి చేరుకునే రహదారుల్లోని టోల్ ప్లాజాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతులు నిరసనలు చేస్తున్న ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా పెట్టారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం టోల్ ప్లాజాల వద్ద భారీగా బలగాలను మోహరించింది.
దిల్లీ సరిహద్దులో రైతుల నిరసన ఇవీ చదవండి:
నిరసనలో వైవిధ్యం- వినోదానికీ సంసిద్ధం
దిల్లీ సరిహద్దులో రైతులకు 'ఫుట్ మసాజర్లు'