రైతుల ఆందోళన గురువారం 15వ రోజుకు చేరినా పరిష్కార మార్గం కనిపించడం లేదు. ఇరు పక్షాలూ తమ వాదనే వినిపిస్తుండటం వల్ల ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. మూడు వ్యవసాయ చట్టాల రద్దుపై పీటముడి పడటంతో తదనంతరం ఏమి జరుగుతుందనేదానిపై స్పష్టత కొరవడింది. ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన రాకపోతే ఆందోళనలను రైతు పట్టాలపైకి తీసుకువెళ్లాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. రైతులతో చర్చలకు ఎప్పుడూ సిద్ధమేనని ప్రభుత్వం పునరుద్ఘాటించింది.
ప్రతిపాదనలు పరిశీలించండి..
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వం ఇచ్చిన తాజా ప్రతిపాదనలను పరిశీలించాలని తదుపరి చర్చల తేదీని వీలైనంత త్వరగా నిర్ణయించాలని రైతులను విజ్ఞప్తి చేశారు. చర్చలు జరుగుతోన్న సమయంలో తదుపరి ఆందోళన కార్యక్రమాలు ప్రకటించడం సరికాదన్నారు. రైతుల ఆందోళనల వెనుక ఏమైనా శక్తులున్నాయా అని పీయూష్ గోయల్‌ను ప్రశ్నించగా "మీడియా కళ్లు నిశితమైనవి. తన పరిశోధనాత్మక నైపుణ్యాలను ఉపయోగించి ఈ విషయాన్ని కనుక్కోవాలి" అని వ్యాఖ్యానించారు.
పిలిస్తే పరిశీలిస్తాం:రైతు నేతలు
"ఇంతవరకు ఐదు దఫాలుగా చర్చలు జరిగినా అసంపూర్తిగా ముగిశాయి. కేంద్రం మరోసారి ఆహ్వానం పంపితే అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం."