తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వీరమరణం పొందిన రైతులకు డిసెంబర్​ 20న నివాళి' - దిల్లీ సరిహద్దులో రైతుల నిరసనలు

Farmers' protest against Centre's three farm laws continues for the 20th day at Singhu border with Delhi
సాగు చట్టాలకు వ్యతిరేకంగా 20వ రోజుకు చేరిన రైతుల ఆందోళనలు

By

Published : Dec 15, 2020, 9:53 AM IST

Updated : Dec 15, 2020, 6:59 PM IST

18:56 December 15

'భారతీయ కిసాన్​ యూనియన్​ మద్దతు..'

భారతీయ కిసాన్​ యూనియన్​(కిసాన్​) సభ్యులు నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలిపారు. ఈ విషయాన్ని.. వారితో జరిగిన భేటీ అనంతరం కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ వెల్లడించారు. కొందరు రైతులు.. వీరిలో అనుమానాలు రేకెత్తించారని.. తాను వాటిని తొలిగించానని స్పష్టం చేశారు. అందుకే వారు చట్టాలకు మద్దతిస్తున్నట్టు వివరించారు.

18:48 December 15

డిసెంబర్​ 20న వారికి నివాళి..

నూతన సాగు చట్టాల రద్దుకు 20 రోజులుగా ఆందోళన చేస్తున్న అన్నదాతలు పోరును ఉద్ధృతం చేశారు. తమను సంక్షోభంలోకి నెట్టే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. ఏదేమైనా తాము తప్పనిసరిగా గెలవాలని నిశ్చయించుకునే దశకు ఈ పోరాటం చేరిందని రైతు నేతలు వ్యాఖ్యానించారు. ఆందోళనల్లో ఇప్పటి వరకు 20 మంది రైతులు అమరులయ్యారన్న అన్నదాతలు వారికి డిసెంబర్‌ 20న అన్ని గ్రామాల్లోనూ ప్రజలు నివాళులర్పించాలని కోరారు. బుధవారం దిల్లీ-నోయిడా మధ్య ఉన్న చిల్లా బోర్డర్‌ను పూర్తిగా మూసివేయనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం సాగు చట్టాలను రద్దు చేయనని అంటోందని ఐతే వారితోనే వాటిని రద్దు చేయిస్తామని రైతులు అన్నారు

18:28 December 15

దిల్లీ సరిహద్దులో...

దిల్లీలో రైతన్న ఆందోళనలు రోజురోజుకు ఉద్ధృతంగా మారుతున్నాయి. తాజాగా.. దిల్లీ-నోయిడా మధ్య ఉన్న చిల్లా సరిహద్దును బుధవారం పూర్తిగా దిగ్బంధిస్తామని పేర్కొన్నారు రైతులు. 

మరోవైపు సోమవారం 350 జిల్లాల్లో చేపట్టిన్న నిరసన కార్యక్రమాలు విజయవంతమైనట్టు రైతు సంఘాలు నేతలు వెల్లడించారు. 150 టోల్​ ప్లాజాల్లో ఎలాంటి రుసుములు కట్టకుండా వాహనాలను పంపించినట్టు పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు తమ నిరసనల్లో 20మంది రైతులు 'అమరులు' అయ్యారని వివరించారు. అంటే సగటుకు రోజున ఒకరు మరణించారని స్పష్టం చేశారు.

కేంద్రంతో చర్చలు జరిపేందుకు తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని.. కానీ తమ డిమాండ్ల్​ను ప్రభుత్వం కూడా పట్టించుకోవాలని పేర్కొన్నారు రైతన్నలు. తమ సమస్యలకు సరైన పరిష్కారంతో కేంద్రం ముందుకు రావాలని తేల్చిచెప్పారు.

18:14 December 15

తోమర్​తో భేటీ...

దిల్లీలో రైతు ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్న తరుణంలో.. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​తో భారతీయ కిసాన్​ యూనియన్​(కిసాన్​) సభ్యులు భేటీ అయ్యారు. కృషి భవన్​లో వీరి మధ్య భేటీ సాగింది.

మరోవైపు నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా.. దిల్లీలో ఆందోళన చేపట్టారు కాంగ్రెస్​ సభ్యులు. చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేస్తూ.. భాజపా ప్రధాన కార్యాలయం వద్ద నిరసనలు చేశారు.

15:32 December 15

సింఘూ సరిహద్దు వద్ద మరో రైతు మృతి..

దిల్లీ-హరియాణా సింఘూ సరిహద్దు వద్ద మరో రైతు మృతిచెందాడు. డిసెంబర్​ 6నుంచి ఆందోళనల్లో పాల్గొన్న రైతు... ఇవాళ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. 

11:10 December 15

గత కొద్ది నెలల్లోనే అంబానీ, అదానీ గ్రూప్స్​ నుంచి 53 వ్యవసాయ ఆధారిత కొత్త కంపెనీలు రిజిస్టర్​ అయ్యాయని తమకు సమాచారం ఉందని కాంగ్రెస్​ పంజాబ్​ ఎంపీ జేఎస్​ గిల్​ తెలిపారు. రైతుల ఆందోళనలకు మద్దతుగా దిల్లీలో జంతర్​మంతర్​ వద్ద ఆయన నిరసన చేపడుతున్నారు. అన్నదాతల గళాన్ని కేంద్రం వినేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పారు.

10:58 December 15

కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలు వ్యాపారవేత్తలకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయని జైసింగ్​పుర్​-ఖేరా సరిహద్దు వద్ద ఆందోళనలు నిర్వహిస్తున్న కిసాన్​ మహాపంచాయత్​ నాయకులు రాంపాల్​ జాట్​ తెలిపారు.

10:54 December 15

సింఘు సరిహద్దులో ఆందోళనలు చేపట్టిన ప్రదేశంలో పరిశుభ్రత లేదని ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు రైతులు. పరిపాలనా యంత్రాంగం వాష్​రూంలలో నీటిని కూడా అందుబాటులో ఉంచడం లేదని తెలిపారు. తాము రోగాల బారినపడి చనిపోయినా సరే, డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యామాన్ని మాత్రం ఆపే ప్రసక్తే లేదని పంజాబ్​ సంగ్రూర్​కు చెందిన భాగ్​ సింగ్​ అనే రైతు తేల్చి చెప్పారు.

10:50 December 15

సింఘు సరిహద్దులో రైతుల ఆందోళనలు 20వ రోజుకు చేరిన నేపథ్యంలో ర్యాపిడ్​ యాక్షన్​ ఫోర్స్(ఆర్​ఏఎఫ్​) బలగాలను మోహరించింది ప్రభుత్వం. ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టింది.

10:06 December 15

రాజస్థాన్​-హరియాణా సరిహద్దు జైసింగ్​పుర్​-ఖేరాలో రైతులు చేపట్టిన ఆందోళనలు ముడో రోజుకు చేరాయి. అక్కడ రోడ్డుపై బైఠాయించి ఆదివారం నుంచి నిరసన కొనసాగిస్తున్నారు అన్నదాతలు.

10:04 December 15

టిక్రీ సరిహద్దులో రైతులు చేపట్టిన ఆందోళనలు 20వ రోజుకు చేరాయి. తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసుకుని నిరసనలు కొనసాగిస్తున్నారు రైతులు.

09:59 December 15

వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తూ టిక్రీ సరిహద్దులో అన్నదాతలు 20వ రోజూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. నూతన చట్టాల్లోని అన్ని అంశాలను రైతులకు వివరిస్తూ చర్చలు జరుపుతామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్​ సోమవారం చెప్పారు.

09:55 December 15

ఘాజీపుర్​ వద్ద..

దిల్లీ-యూపీ సరిహద్దు ప్రాంతం ఘాజీపూర్​లో 18వ రోజూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు రైతులు. ఎముకలు కొరికే చలి కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ తమకు న్యాయం జరిగే వరకూ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.

09:46 December 15

'నూతన సాగు చట్టాలతో వ్యాపారవేత్తలకే ప్రయోజనం'

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సాగు చట్టాల రద్దు కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళనలు 20వ రోజుకు చేరాయి. చలి పంజా విసురుతున్నా అన్నదాతలు ఆందోళన పంథా వీడడం లేదు. సోమవారం ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగిన కర్షకులు.. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. వివిధ మార్గాల్లో నిరసనలను ముమ్మరం చేయాలని భావిస్తున్న రైతులు.. తదుపరి కార్యాచరణను పొందించనున్నారు.

దేశ రాజధాని సరిహద్దుల్లో 32 రైతు సంఘాలు పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. దిల్లీ- జైపుర్​ జాతీయ రహదారిపై కర్షకులు భైఠాయించగా.. సింఘు ప్రాంతంలోనూ రైతుల ఆందోళన సాగుతోంది. సాగు చట్టాలు రద్దు చేయాలన్న నినాదాలతో దిల్లీ పరిసరాలు మార్మోగుతున్నాయి. దిల్లీ-యూపీ సరిహద్దులోని ఘాజీపుర్‌లోనూ రైతు ఆందోళనలు కొనసాగుతున్నాయి. వందలాది మంది పోలీసుల పహారా మధ్య పోరాటం చేస్తున్నారు. 

Last Updated : Dec 15, 2020, 6:59 PM IST

ABOUT THE AUTHOR

...view details