కేంద్ర ప్రభుత్వం నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన 'చలో దిల్లీ' ఆందోళనలు పలు చోట్ల తీవ్ర రూపం దాల్చాయి. నిరసనల నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీ సరిహద్దులను ముందుగానే మూసివేశారు అధికారులు. హరియాణా అంబాలా సమీపంలోని శంభు సరిహద్దు వద్దకు భారీగా తరలివచ్చి దిల్లీ వెళ్లేందుకు ప్రయత్నించిన రైతులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో గుమిగూడిన నిరసనకారులను చెదరగొట్టేందుకు జలఫిరంగులు, బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు పోలీసులు. ఈ చర్యతో ఆగ్రహించిన ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. వంతెనపై ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి కిందకు విసిరారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
చలో దిల్లీ ఆందోళనల్లో భాగంగా హరియాణా కర్నాల్ సమీపంలో కర్నా సరస్సు ప్రాంతానికి రైతులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రహదారిని దిగ్భంధించి దిల్లీ వైపు ర్యాలీ నిర్వహించారు.