కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తన కార్యాలయంలో నిరసనలు చేపట్టింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్, ఇంఛార్జ్ రణ్‌దీప్ సుర్జేవాలా, మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనలు - farmers protests today
13:57 September 28
13:28 September 28
కర్ణాటక కొడగు జిల్లాలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన కాంగ్రెస్, జేడీఎస్, ఎస్డీపీఐ కార్యకర్తలను పోలీసులు నిర్బంధించారు.
12:46 September 28
పంజాబ్ ముఖ్యమంత్రి నిరసన..
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్. భగత్ సింగ్ నగర్‌లోని ఖాట్కర్ కలన్‌లో ఆందోళనకారులకు మద్దతు తెలిపారు. అంతకు ముందు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు అమరీందర్.
12:09 September 28
మానవహారం..
వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ కర్ణాటక శివమొగ్గలోని అశోక సర్కిల్లో మానవ హారంగా నిలబడ్డారు రైతు సంఘం, జేడీఎస్, ఎస్డీపీఐ, కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు. జెండాలు, బ్యానర్లు పదర్శించారు. డప్పులు వాయించి ఆందోళనలు చేపట్టారు.
11:59 September 28
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కర్ణాటకలో రైతు సంఘాలు బంద్ పాటిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. బెంగళూరులోని పుట్టన్న చెట్టి టౌన్ హాల్ ఎదురుగా మహిళలు నృత్య ప్రదర్శనతో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
11:49 September 28
వ్యవసాయ చట్టాలను తమిళనాడు పొరుగు రాష్ట్రం కేరళ వ్యతిరేకిస్తోందని చెప్పారు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్. ఈ విషయంపై పినరయ్ విజయన్ సర్కారు న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో ఉందని పేర్కొన్నారు. అదే తరహాలో తమిళనాడు ప్రభుత్వం కూడా కోర్టుకు వెళ్లాలని సూచించారు. లేకపోతే ఆ బాధ్యతను ప్రతిపక్షాలు తీసుకుంటాయని తేల్చి చెప్పారు. తమిళనాడు కాంచీపురంలోని కీజంబి గ్రామంలో రైతుల నిరసన కార్యక్రమంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు స్టాలిన్.
11:20 September 28
కర్ణాటకలో వ్యవసాయ చట్టాల వ్యతిరేక ఆందోళనల్లో భాగంగా శివమొగ్గలో బైక్ ర్యాలీ నిర్వహించారు జేడీఎస్ కార్యకర్తలు. లక్షీ థియేటర్ సర్కిల్ వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
11:16 September 28
దిల్లీ గేట్ వద్ద ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన ఘటనలో పంజాబ్‌కు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించినట్లు చెప్పారు.
11:12 September 28
ట్రాక్టర్‌కు నిప్పు..
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దిల్లీలోని ఇండియాగేట్ వద్ద ఓ ట్రాక్టర్‌కు నిప్పంటించారు ఆందోళన కారులు. అనంతరం భగత్‌సింగ్ చిత్రపటంతో నిరసనలు చేపట్టారు.
11:09 September 28
తమిళనాడులో
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమిళనాడు కాంచీపురంలోని కీజంబి గ్రామంలో రైతులు నిరసనలు చేపట్టారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఈ కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలిపారు.
10:44 September 28
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలు
కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. అఖిల భారత కిసాన్ సభ(ఏఐకేఎస్) సహా ఇతర రైతు సంఘాలు కర్ణాటకలో బంద్ నిర్వహిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. రోడ్లపై ఆందోళనలకు దిగాయి.