కరోనా లాక్డౌన్ సమయంలో వ్యవసాయ రంగం తన సత్తా నిరూపించుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఆత్మనిర్భర్ భారత్ పునాదికి రైతులు, గ్రామాలు, వ్యవసాయ రంగమే కీలకంగా నిలుస్తాయని అన్నారు. రైతులు పటిష్ఠంగా ఉంటే ఆత్మనిర్భర్ భారత్ పునాది పటిష్ఠంగా ఉంటుందని పేర్కొన్నారు.
మన్‌కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మోదీ. సాంకేతికతను వినియోగించుకుంటే దేశ వ్యవసాయ రంగం విశేషంగా అభివృద్ధి సాధిస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. జాతిపిత మహాత్మ గాంధీ ఆర్థిక విధానాలను అనుసరించి ఉంటే.. ఇప్పుడు ఆత్మ నిర్భర్ భారత్ ప్రచారం చేయాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదన్నారు.
కథలు చెప్పండి
భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించుకోనున్న నేపథ్యంలో దేశం కోసం పోరాటం చేసిన యోధుల గాథలను చిన్నారులకు కథలుగా చెప్పాలని సూచించారు. ముఖ్యంగా 1857 నుంచి 1947 మధ్య జరిగిన పరిణామాలను కథల రూపంలో తీసుకురావాలని కోరారు. కొత్త తరానికి చరిత్రను కథల రూపంలో అందించాలని పేర్కొన్నారు. భారత్‌లో కథలకు పురాతన చరిత్ర ఉందని పేర్కొన్నారు మోదీ.