భారత్‌లో వ్యవసాయం రైతుల జీవన విధానం. అన్నదాతకు సేద్యం ఎప్పుడూ నిరాశనే మిగులుస్తోంది. అదేం విచిత్రమోగానీ రైతులను మినహాయిస్తే వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడిన దళారులు, వ్యాపారులు వంటి వర్గాలన్నీ లాభాల బాటలోనే సాగుతున్నాయి. విత్తన కొనుగోలు నుంచి మార్కెట్లలో పంట విక్రయించడం వరకు రైతుల ప్రయోజనాలను పరిరక్షించేలా సమగ్ర చట్టాలు లేకపోవడం పెద్ద లోపం.
రైతు కోరేది ఇదే
విత్తన చట్టమే ఇందుకు ఉదాహరణ. ప్రభుత్వరంగ విత్తన సంస్థలు రంగంలో ఉన్నప్పుడు రూపొందించిన నిబంధనలే, ప్రైవేటు రంగం విస్తరించిన కాలంలోనూ ఆచరణలో ఉండటం రైతుల ప్రయోజనాల్ని బలిపెట్టడమే.
వ్యవస్థలోని లోటుపాట్లు రైతుల హక్కుల్ని కాలరాస్తున్నా దశాబ్దాలుగా చోద్యం చూసిన పాలకులు కొత్త విత్తన చట్టం రూపకల్పన వైపు త్వరితంగా అడుగులు వేయడం అవసరం. ఈ క్రమంలో విత్తన బిల్లు ముసాయిదాను మరోసారి దేశం ముందుంచిన మోదీ ప్రభుత్వం కొత్త విత్తన చట్టానికి రూపకల్పన చేయాలని రైతులోకం కోరుకుంటోంది.
చట్టం గట్టిగా లేనందునే
ఇప్పటికే అమల్లో ఉన్న విత్తన చట్టం ప్రకారం నకిలీ, నాసిరకం విత్తనాల సమస్యలు ఉత్పన్నమైనప్పుడు రైతులు వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేస్తే రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటుంది.
చట్టంలోని నిబంధనలు కఠినంగా లేకపోవడంతో కొన్ని కంపెనీలు లేదా విక్రేతలు కొందరు కీలక అధికారుల్ని ప్రభావితం చేస్తూ, కొద్దిపాటి జరిమానాలతో తప్పించుకుంటున్నారు. పెద్దసంఖ్యలో రైతులు నష్టపోయిన కేసుల్లో మాత్రం వ్యక్తులు/కంపెనీల లైసెన్సులు రద్దు చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో కూడా పలు కంపెనీలు మారుపేర్లతో అవే విత్తనాలను తయారు చేస్తూ విపణిలోకి ప్రవేశిస్తున్నాయి.
ఇవన్నీ ఆయా రాష్ట్రాల వ్యవసాయ శాఖలు, నిఘా విభాగాలకు తెలిసినా రైతుల్ని వంచించే క్రమంలో వీరి మధ్య నెలకొన్న అపవిత్ర సంబంధాలు అన్నదాతల ఉసురు తీస్తూనే ఉన్నాయి. కొన్ని కంపెనీలు మిగిలిపోయిన విత్తనాలను తదుపరి పంటకు తిరిగి కొత్తగా ప్యాకింగ్ చేసి విక్రయించడం, జన్యు స్వచ్ఛత లేని వాటినీ సరికొత్త విత్తనాలతో కలగలిపి మార్కెట్ చేయడం వంటి అనుచిత పనులు చేస్తుంటాయి.
ఫలితంగా రైతులకు దిగుబడి తగ్గుతుంది. కొంతమంది పేరొందిన కంపెనీల విత్తన ప్యాకెట్ల మాదిరిగానే అచ్చుగుద్దినట్టు ముద్రించి రైతులకు అంటగడుతున్నారు. ఇలాంటి నకిలీ విత్తనాల్ని నియంత్రించాల్సిన బాధ్యత నిఘా యంత్రాంగానిదే.
ప్రయోజనం అంతంతమాత్రం
పార్లమెంటరీ స్థాయీ సంఘం 2004 విత్తన బిల్లులో ఉన్న లోపాలను గుర్తించి, చేసిన సూచనలను కొత్త ముసాయిదా చట్టం 2019లో చేర్చలేదు. ఈ ముసాయిదాను ప్రస్తుతం మోదీ ప్రభుత్వం దేశం ముందుంచింది.
బిల్లుపై ఏవైనా అభ్యంతరాలుంటే నవంబరులోగా సూచించాలని కోరింది. 2019 విత్తన చట్టం ముసాయిదా సెక్షన్-21 ప్రకారం నకిలీ, నాసిరకం విత్తనాల వల్ల రైతులు నష్టపోతే విత్తన అమ్మకం దారుల నుంచి 1986 వినియోగదారుల చట్టం కింద రైతులు పరిహారం పొందవచ్చని ప్రస్తావించారు. ఇది సరికాదు.
విత్తనం అమ్మిన వ్యక్తులు లేదా కంపెనీలు నష్టపరిహారాన్ని కేవలం ఆ మొత్తానికి వడ్డీ కలిపి చెల్లించాలని ఫోరం తీర్పు చెబుతుందే కానీ, ఆ విత్తనాలు వాడటం వల్ల రైతు ఒక పంట కాలాన్ని, తద్వారా కోల్పోయిన దిగుబడికి తగ్గ పరిహారాన్ని ఇవ్వాలని ఫోరం ఆదేశించదు. పైగా ఫోరం తీర్పులు ఏళ్ల తరబడి సాగుతుండటం కూడా రైతులకు నష్టమే.
ఇందుకు నష్టపరిహారం అందించే కేంద్ర, రాష్ట్ర స్థాయి విత్తన కమిటీలలో రైతులు, కర్షక సంఘాల ప్రతినిధులకు అవకాశం కల్పించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. విత్తన కంపెనీలు తమ విత్తనాలకు సంబంధించి స్వీయ ధ్రువీకరణ ఇచ్చుకోవడాన్ని ముసాయిదాలో రద్దు చేయడం బాగుంది.
ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ధరలను నియంత్రించే సావకాశం కమిటీకి ఉంటుందని బిల్లులో పేర్కొనడం వల్ల వాణిజ్య పంటల విషయంలో విత్తన ధరలను నియంత్రించడం కష్టమవుతుంది. తద్వారా రైతులు మరింత ఇబ్బందిపడే అవకాశముంది. కాబట్టి ధర నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వాలకు విధిగా నియంత్రణ ఉండేలా ముసాయిదా మార్చాలి.
సెక్షన్-40 ప్రకారం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే విత్తన రకాల విషయంలో పర్యావరణ రక్షిత చట్టం ప్రకారం నిబంధనలను నిర్దేశించారు. దిగుమతి చేసుకునే విత్తనాలను కనీసం 21 రోజుల పాటు ‘క్వారంటైన్’లో పెట్టి క్షేత్రసాయిలో తగిన పరిశోధనలు చేసి మన వాతావరణంలో పరీక్షించిన తర్వాతే మార్కెట్లోకి విడుదల చేయాల్సిన అవసరముంది. ముసాయిదాలో ఆ మేరకు మార్పులు చేపట్టాలి.
విత్తనంలో కల్తీ చేస్తే అంతే
సాధారణంగా విత్తన స్వచ్ఛత నూరు శాతం, మొలక 80శాతం ఉండాలి. అంతకు తగ్గితే వాటిని నాసిరకాలుగా నిర్ధారిస్తామని ముసాయిదాలో పేర్కొనాలి. సెక్షన్-23 ప్రకారం వ్యవసాయ పట్టభద్రులకే డీలర్ లైసెన్స్ ఇవ్వాలి.
విత్తన మోసాలు, విత్తనాల జన్యుస్వచ్ఛత, విత్తన నాణ్యత లోపించినప్పుడు విత్తన అమ్మకందారులకు రూ.25 వేల నుంచి అయిదు లక్షల రూపాయల వరకు జరిమానా, గరిష్ఠంగా ఏడాది జైలుశిక్ష లేదా రెండూ విధించే అవకాశం కల్పించారు.
2004 చట్టంలోనే రూ.50 వేల నుంచి అయిదు లక్షల రూపాయల వరకు జరిమానాలు విధించవచ్చని పేర్కొన్నారు. పార్లమెంటరీ స్థాయీ సంఘం గరిష్ఠంగా ఏడాది జైలుశిక్షతో సహా జరిమానా రెండు లక్షల రూపాయల నుంచి రూ.10 లక్షల వరకు విధించాలని సూచించినా ఆ మేరకు 2019 చట్టం ముసాయిదా జరిమానాలను తగ్గించింది.